
రుణపరిమితి పెంపు..
అన్నదాతలకు అందనున్న అదనపు సహాయం
నర్వ: వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నారాయణపేట రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు సహకార అపెక్స్ బ్యాంక్ 2025–26 ఆర్థిక సంవత్సరం రుణపరిమితిని పెంచింది. ఈ మేరకు వ్యవసాయ దారులకు అందించే వివిధ రకాల పంట రుణాలు 10 శాతం అధికంగా అందనున్నాయి. దాదాపుగా 122 రకాలైన పంటలతో పాటుగా పాడి, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకం యూనిట్లకు రుణాలు అందించనున్నారు. గతంలో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు పంట పెట్టుబడికి ఏమాత్రం సరిపోక రైతులు ప్రైవేటులో అప్పులు చేసేవారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రుణపరిమితిని పెంచడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
రైతులకు ఆర్థిక చేదోడు దక్కేనా..?
సాగునీటి కల్పన, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, ఎద్దులు, ఎడ్లబండ్లు, భూముల అభివృద్ధి విత్తనోత్పత్తి, సేంద్రియ సాగు రుణాలు చాలా వరకు రైతులకు అందడం లేదు. జిల్లాలో గడిచిన వానాకాలం, యాసంగి సీజన్‌లలో పంట రుణాలు, అనుబంధ రుణాల మంజూరులో 67శాతం వరకు మాత్రమే లక్ష్యాన్ని చేరగలిగారు. వ్యవసాయ అనుబంధ టర్మ్ రుణాలను సైతం 30 శాతంలోపే రైతులకు అందాయి. 2025–26 సంవత్సరం రూ. 4204.49 కోట్ల రుణ ప్రణాళికను నాబార్డు ఖరారు చేయగా.. పంట రుణాలు, వ్యవసాయ అనుంబంధ రుణాలు వందశాతం రైతులకు అందించాలని లక్ష్యంగా ఉంది. బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు అందిస్తేనే రైతులకు ఆర్థిక చేదోడుగా ఉంటుంది. బ్యాంకర్లు పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడంతో పాటు సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు నిర్దేశిత మొత్తం కంటే 30 శాతం వరకు కూడా రుణాన్ని అధికంగా పెంచి ఇచ్చే వీలుంది.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లోని 252 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1.45 లక్షల మంది రైతులు ఉండగా.. 4,37,865 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. వాణిజ్య పంట అయిన పత్తిని గతేడాది 1.71 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. ఈ ఏడాది 1.75 లక్షల ఎకరాల్లో సాగు అంచనాను వ్యవసాయశాఖ ప్రణాళికలో పేర్కొంది. ఆ తర్వాత వరి, కందులు, ఇతర పంటల వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.
2025–26 ఆర్థిక సంవత్సరం రుణపరిమితి ఖరారు
122 రకాల పంటలకు 10శాతంఅధికంగా రుణాలు
జిల్లాలో 1.45 లక్షల మంది రైతులకుచేకూరనున్న ప్రయోజనం

రుణపరిమితి పెంపు..

రుణపరిమితి పెంపు..

రుణపరిమితి పెంపు..