
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాలరాం, ఏఐయూపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. కార్మికులకు నష్టం కలిగించే నాలు గు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు తదితర హక్కులను హరించడం దారుణమన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించిన నాలు గు కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలన్నా రు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, పెన్షన్ తదితర చట్టబద్ధమైన సౌకర్యలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న కార్మిక సంఘా లు, సంయుక్త కిషాన్ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను అనివార్య కారణాలతో జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. టీయూసీఐ జిల్లా కార్యదర్శి నర్సింహ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కార్మిక, ప్రజా సంఘాల నాయకులు వెంకట్రాములు, కృష్ణయ్య, నారాయణ, బాలకృష్ణ, కెంచ నారాయణ, కేశవులు, సౌభాగ్య, నాగేంద్రమ్మ, గౌసియా, వైశాలి, జ్యోతి పాల్గొన్నారు.
పెసర క్వింటాల్ రూ.7,577
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్‌యార్డులో మంగళవారం పెసర క్వింటాల్ గరిష్టంగా రూ. 7,577, కనిష్టంగా రూ. 5,559 ధర పలికింది. హంసధాన్యం గరిష్టంగా రూ. 1,550, కనిష్టంగా రూ. 1,401, సోనాధాన్యం గరిష్టంగా రూ. 2,079, కనిష్టంగా రూ. 1,360, ఎర్ర కందులు రూ. 5,609, తెల్ల కందులు రూ. 6,939 ధరలు వచ్చాయి.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,234
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం వ్యవసాయ పంట దిగుబడులు పోటెత్తాయి. యార్డుకు 7,070 క్వింటాళ్ల పంట ఉత్పత్తులు విక్రయానికి వచ్చాయి. మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,234, కనిష్టంగా రూ. 1,422 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,065, కనిష్టంగా రూ.5,990, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,709, కనిష్టంగా రూ.1,600, ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,601, వేరుశనగ రూ.4,312 ధరలు లభించాయి.
ఇద్దరు ఎస్‌ఐల బదిలీ
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలకు స్థానచలనం కల్పిస్తూ జోగులాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కోయిలకొండ ఎస్‌ఐగా పని చేస్తున్న భాస్కర్‌రెడ్డిని వీఆర్ వనపర్తికి బదిలీ చేయగా, వీఆర్ వనపర్తిలో ఉన్న కె.తిరుపాజీని కోయిల్‌కొండ ఎస్‌ఐగా బదిలీ చేశారు.
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 ప్రైవేట్ కంపెనీల్లో 450 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు.