
విద్యాబోధనలో సాంకేతికత జోడించాలి: డీఈఓ
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యాబోధనలో సాంకేతికత జోడించాలని డీఈఓ గోవిందరాజులు ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జిల్లాలోని ఉపాధ్యాయులకు మంగళవారం రెండో విడత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. డీఈఓ గోవిందరాజులు, శిక్షణ తరగతుల పరిశీలకుడు జీరాజుద్దీన్ ఆధ్వర్యంలో 141 మంది తెలుగు, 143 మంది హిందీ, 168 మంది భౌతికశాస్త్రం, 127 మంది జీవశాస్త్రం, 56 మంది సాంఘిక శాస్త్రం, 50 మంది ఆంగ్లం, 54 మంది గణిత ఉపాధ్యాయులతో పాటు 63 మంది హెచ్‌ఎంలు, 68 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయు లు ప్రేరణాత్మకంగా ఉండటం, విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధించడం, సృజనాత్మకత వెలికితీయడం, విద్యా సామర్థ్యాలు పెంచడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇస్తున్నట్లు డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓ రాజేంద్ర కుమార్, ఏఎంఓ విద్యాసాగర్, ఎండీఎం ఇన్‌చార్జి యాదయ్య శెట్టి, డీఎస్‌ఓ భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.