
రాష్ట్రావతరణ దినోత్సవానికి ఏర్పాట్లు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణపై ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 2న నిర్వహించే రాష్ట్రావతరణ దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలను డీఈఓ ఆధ్వర్యంలో నిర్వహించాలని.. మైక్ ఇతర సదుపాయాలను డీపీఆర్‌ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. వైద్యం, ఫైర్ ఇతర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జూన్ 2న జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సమన్వయంతో విధులు నిర్వర్తించాలి
బక్రీద్ పండుగ వేళ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, ఎస్పీ సమీక్షించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గొర్రెలు, మేకలను స్లాటర్ హౌస్‌ల్లోనే వధించాలని.. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వధించరాదని సూచించారు. వాటికి తప్పనిసరిగా పశువైద్యాధికారిచే ధ్రువపత్రం పొందాలన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి శాంతిభద్రల సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువులకు తగిన షెల్టర్ కల్పిస్తూ.. వాటికి పశుగ్రాసం, నీటి వసతి అందుబాటులో ఉండాలని తెలిపారు. పశువుల సంతలలో నిబంధనలకు అనుగుణంగా, పశు సంరక్షణ చట్టానికి లోబడి క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలన్నారు. మసీదు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, జిల్లా మైనార్టీ అధికారి రషీద్ తదితరులు ఉన్నారు.