
భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నారాయణపేట/మద్దూరు: భూ భారతి పైలెట్ ప్రాజెక్టులో భాగమైన మద్దూరులో రైతుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఈ నెల 18 వరకు పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ రెవెన్యూ అధికారులను అదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి మద్దూరులోని నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తతో చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం పంపిణీ, చిన్నారుల సంఖ్య తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. 15న రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. హన్మనాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించవచ్చని, ఈ అంగన్‌వాడీలో చిన్నారులకు అడుకోవడానికి పరికరాలను ఏర్పాటు చేయాలని పీఆర్ అధికారులకు సూచించారు. అనంతరం మద్దూరు తహసీల్దార్ కార్యలయంలో భూ భారతి కార్యక్రమంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులకు ఎన్ని పరిష్కరించారని, మిగితావాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని అదేశించారు. కార్యక్రమంలో పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్, తహసీల్దార్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు.
ఆరు నెలల్లో ‘కలెక్టరేట్’ పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలోని సింగారం మలుపు దారి వద్ద రూ.56 కోట్లతో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ భవన నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి.. మ్యాప్ ప్రకారం ఇప్పటి వరకు ఏ పనులు ఏఏ దశల్లో కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆరు నెలల్లోగా కలెక్టరేట్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజేందర్ డీఈ రాములు, ఏఈలు, టెక్నికల్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
నర్వ ‘ఏబీపీ’పై సమీక్ష
నారాయణపేట: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం(ఏబీపీ) నర్వ మండలంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్.. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పోషకాహారం, ఆరోగ్యం, విద్య రంగంలో కార్యాచరణ ప్రణాళిక/ప్రాజెక్టు ప్రతిపాదన తయారీ ఎంత వరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రంగంలో ఫలితాల ఆధారిత, అత్యంత అవసరమైన ప్రతిపాదనను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సించిత్ గంగ్వార్ ప్రతి రంగానికి బడ్జెట్ కేటాయింపుపై వివరాలను వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల పునరుద్ధరణ, పోషకాహార రంగానికి దాదాపు రూ.కోటి, మిగిలిన రూ.15 నుంచి 20 లక్షల బడ్జెట్‌ను ఆరోగ్యం, విద్యా రంగానికి కేటాయించాలని తెలిపారు. బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, కేజీబీవీలో మౌళిక సదుపాయల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే ఆరోగ్య రంగంలో వైద్య పరికరాల సేకరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన వివరించారు. సమీక్షలో డీఆర్‌డీఓ మొగులప్ప, అధికారులు మోహన్, గోవిందురాజులు, బిక్షపతి, నర్వ ఆస్పరేషన్ బ్లాక్ ఇంచార్జీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.