
క్రీడారంగ అభివృద్ధికి కృషి
నర్వ/మక్తల్: ఔత్సాహిక క్రీడాకారుల ఇబ్బందులు తీర్చేందుకే జాండ్రగుట్ట వద్ద క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరి అన్నారు. బుధవారం సాయంత్రం నర్వ జాండ్ర గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, క్రీడామైదానానికి అనుమతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రూ. 60 లక్షల నిధులు క్రీడామైదానం ఏర్పాటు కోసం కేటాయిస్తున్నట్లు శివసేనారెడ్డి ప్రకటించి ఇందుకు సంబందించిన పత్రాన్ని అందించారు. ఎమ్మెల్యే తన నిధుల నుంచి రూ. 45 లక్షలు క్రీడామైదానం అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. త్వరలో క్రీడామైదానం పనులు చేపట్టి పూర్తి చేసి క్రీడాకారులు ఆటలు ఆడే విధంగా తయారు చేస్తామని అన్నారు. దీంతో పాటు జూనియర్ కళాశాలను ఈ అకాడమిక్ ఇయర్‌లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్పోర్ట్స్ చైర్మన్‌ను, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
● ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌లోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.5.30 కోట్లతో మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మారుమూల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.