
రథాన్ని లాగుతున్న భక్తులు
మాగనూర్: మండల పరిధిలోని కొత్తపల్లిలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆంజనేయస్వామి జాతరలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ముందుగా తెల్లవారుజామున ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రథాన్ని పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. రథంలో కొలువుదీరిన ఆంజనేయస్వామి విగ్రహానికి అడుగడుగునా మంగళ నీరాజనాలు పలికారు. స్వామి రథాన్ని లాగేందుకు భక్తులు పొటీపడ్డారు. గ్రామ పూజారి ఆలయం నుంచి పల్లకిలో స్వామివారి విగ్రహాలను మంగళవాయిద్యాలతో రథం వద్దకు తీసుకొచ్చారు. ఆలయ పూజారులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు భక్తిశ్రద్ధలతో రథాన్ని ముందుకు లాగారు.
భక్తిశ్రద్ధలతో పాల ఉట్లు..
జాతర సందర్భంగా సాయంత్రం నిర్వహించిన పాలుఉట్ల కార్యక్రమం కనులపండువగా సాగింది. దాదాపుగా రెండు గంటల పాటు సాగిన ఈ పోటీల్లో గ్రామానికి చెందిన 20 మంది యువకులకు పైగా పాలఉట్ల కంబం ఎక్కడం కోసం పోటీపడ్డారు. చివరికి లోకపల్లి పోలప్ప వాటిని సాధించాడు. పాలఉట్లు తిలకించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సర్పంచ్ తిమ్మప్ప, సింగిల్‌విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ బంగి లక్ష్మి, ఉపసర్పంచ్ అంజమ్మ, గ్రామపెద్దలు తాయప్ప, శంకర్, కలప్పచారీ, గోవింద్, కృష్ణయ్య, దేవరాజ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.