 
															నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి
బనగానపల్లె: కూటమి ప్రభుత్వం వెంటనే మైనింగ్ ప్రైవేటీకరణను రద్దు చేసి నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని మైనింగ్, ట్రాక్టర్ యజమానులు, కార్మికులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ తీరుతో ఉపాధి కోల్పోయి కార్మికులు, వ్యాపారులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. స్థానిక మైనింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మైనింగ్ ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ పలుకూరు క్రాస్ రోడ్డులో రాయల్టీ వసూలుకు ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ధర్నా చేపట్టారు. ప్రైవేటీకరణతో మైనింగ్ పరిశ్రమ స్తంభించి పోయినా కూటమి నేతలు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిబంధనలతో మైనింగ్ లీజ్ పొందాలంటే సుమారు రూ.25 లక్షలు వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు. జిల్లాలోని కూటమి నేతలు వెంటనే ప్రభుత్వంతో చర్చించి ప్రైవేటు చెక్ పోస్టులను ఎత్తేసి మైనింగ్‌పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఆందోళనలో మైనింగ్ అసోసియేషన్ సభ్యులు యల్ల నాగయ్య, విజయుడు, మోహన్‌రావు, నాగేశ్వరరెడ్డి, ఉపేంద్ర, కేటీ చౌదరి, బీటీ మహేష్, తిరుమలేష్‌రెడ్డి, నాగేష్ కుమార్‌రెడ్డి అరుణ్, నామాల వెంకటేశ్వర్లు, ఆర్‌ఆర్ బ్రదర్స్, బి రాజు మరికొందరు మైనింగ్ యజమానులు వ్యాపారులు కార్మికులు పాల్గొన్నారు.
 
							నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
