 
															శ్రీగిరిలో షాడో ఈఓ
రాజకీయ పలుకుబడితో కీలక విభాగానికి బదిలీ
ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు తనకు బాగా క్లోజ్ అంటూ ప్రచారం
సీఎంవోలో ఓ అధికారి తాను ఏమి చెబితే అది చేస్తాడంటూ గొప్పలు
దేవదాయశాఖ రాష్ట్రస్థాయి అధికారి తన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడని ప్రగల్బాలు
శ్రీశైలంటెంపుల్: ‘నేను చెప్పిందే వేదం.. నన్ను ఎవరూ ఏమి చేయలేరు’ అంటూ శ్రీశైల దేవస్థానంలో ఓ చిన్న సారు హవా సాగిస్తున్నా అడిగేవారు లేరు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తనకు ఉన్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి అర్హత లేకపోయినా కీలకమైన విభాగానికి పోస్టింగ్ వేయించుకున్నారు. అంతటితో అ చిన్న సారు అగకుండా తనకు ఇద్దరు కీలక శాఖలకు చెందిన మంత్రులు బాగా తెలుసునని, ఇక కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది బాగా పరిచయమని గొప్పలు చెపుకుంటున్నాడు. అంతేకాకుండా సీఎంవోలో ఓ అధికారి తాను ఎది చెబితే అది చేస్తాడని, దేవదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారి తన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడని దేవస్థాన అధికారుల దగ్గర సొంతడబ్బా కొట్టుకుంటూ, కొంత మంది ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారిని సైతం తన గుప్పిట్లో పెట్టుకున్న చిన్నసారు..షాడో ఈఓగా వ్యవహరిస్తున్నట్లు శ్రీగిరిలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చిన్నసారు తన స్వలాభం కోసం అధికారులు, ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఓ కీలక విభాగానికి విభాగాధిపతిగా పోస్టింగ్ వేయించుకున్నా.. ఆ విభాగంపై పట్టు లేకపోయినా కిందిస్థాయి సిబ్బందిని అడ్డుపెట్టుకుని పనులు చేయిస్తున్నారు. అ విభాగాధిపతితో అందరికి అవసరాలు ఉంటాయి. అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులతో పరిచయాలు సైతం పెరుగుతాయి. అంతేకాకుండా అమ్యామ్యాలు కూడా అదేస్థాయిలో ఉంటాయని, అందుకే ఏరి కోరి స్థానిక ప్రజాప్రతినిధి మీద తనకు తెలిసిన, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, అధికారులతో ఓత్తిడి తెప్పించి మరీ ఆ పోస్టింగ్‌లో జాయిన్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఏకంగా దేవస్థానం ఉన్నతాధికారి చెప్పిన విషయాలను సైతం విస్మరిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
పెత్తనమంతా చిన్న సార్‌దే..
కీలకమైన విభాగానికి అధిపతి అయినప్పటి నుంచి అ చిన్న సారు షాడో ఈఓగా వ్యవహరిస్తున్నట్లు శ్రీగిరిలో చర్చ జరుగుతోంది. దేవదాయశాఖకు కీలక ప్రజాప్రతినిధి కుమార్తె ఏది చెబితే అది చేస్తానమ్మా, ఏదైనా నాకు చెప్పండి అని ఆమె చెప్పిన పనులు చేస్తూ.. ఆమె అండదండలు తనకు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నట్లు సమాచారం. క్షేత్రంలో అన్ని విభాగాల అధికారులు తాను చెప్పిందే వినాలంటూ ఆదేశిస్తూ ఉద్యోగులపై పెత్తనం చేస్తూ షాడో ఈఓగా వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. క్షేత్రంలో ఏ విభాగంలోనైనా అధికారులు ఏ పని చేయాలన్నా షాడో ఈఓను సంప్రదించాల్సిందే, షాడో ఈఓ సూచనలతో ఆయా పనులు చేయాలని ఆదేశిస్తాడని విమర్శలు వినిపిస్తున్నాయి.
నా బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలియదు..
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీలక శాఖ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ కీలక శాఖ మంత్రి తనకు బాగా సన్నిహితులని చిన్న సారు తరచూ సిబ్బంది, అధికారులకు చెప్పుకుంటాడని సమాచారం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేల పరిచయం ఉందని, దేవదాయ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి తన ఇంటికి వచ్చి భోజనం చేస్తాడని, అంతేకాకుండా సీఎంవోలో ఓ ముఖ్య అధికారి కూడా తనకు బాగా సన్నిహితుడని తన సిబ్బందితో గొప్పలు చెప్పుకుంటాడని తెలుస్తుంది. తన బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు.. నేను తలుచుకుంటే మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు’ అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ‘నేను చెప్పిందే వేదం.. నన్ను ఎవరూ ఏమి చేయలేరు’ అని ఉద్యోగులను తన దారిలోకి తెచ్చుకుని తను చెప్పిందే వినేలా చేసుకుంటాడని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై న దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పంధించి షాడో ఈఓగా వ్యవహరిస్తున్న చిన్న సారు పై దృష్టిసారించి అతని చేష్టలకి కళ్లెం వేస్తారో లేక తన రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ చూసి భయపడి ఏమి చేయలేక మిన్నకుండి పోతారో వేచిచూడాలి మరి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
