ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఆళ్లగడ్డ: అకాల వర్షాలతో తడిసి మగ్గిపోయిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్ల వెంట ఆరబోసుకున్న మొక్కజొన్నలను శనివారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే అఖిలప్రియకు రైతుల గోడు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇదే అదునుగా భావించిన దళారులు ధరను అమాంతం తగ్గించేశారన్నారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రతి గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయించాలన్నారు. లేదంటే రైతుల తరఫున పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు.


