‘అంతస్తులు’ దాటిన అవినీతి!
శ్రీశైలం దేవస్థానంలో చక్రం తిప్పుతున్న ఉద్యోగి
శ్రీశైలం టెంపుల్: ఓ ప్రభుత్వ ఉద్యోగి జీతం నెలకు రూ.50వేలు ఉంటుందనుకుంటే, ఆ ఉద్యోగి ఇంట్లో నిత్యావసర సరుకులు, పిల్లల చదువులకు, ఇతర అవసరాలు పోను నెలకు రూ.10వేలు దాచిపెట్టినా సంవత్సరానికి రూ.1.20లక్షలు అవుతుంది. అంటే ఆ ఉద్యోగి సొంత ఇల్లు నిర్మించాలంటే 20సంవత్సరాలు ఇదేవిధంగా డబ్బు దాచిపెడితే రూ.24లక్షలతో ఓ మోస్తరుగా నిర్మించుకోవచ్చు. అలాంటిది శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి ఒకరు ఉద్యోగంలో చేరిన అనతికాలంలోనే రెండంతస్తుల భవనం నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంటి పట్టా బినామీ పేరుతో ఉండగా.. విద్యుత్ మీటర్లు మాత్రం ఆయన సతీమణి పేరిట తీసుకోవడం గమనార్హం. అంతేకాదు.. సొంత ఊర్లో పొలాలు, ఇతర పట్టణాల్లో స్థలాలను కూడా పోగేసుకోవడం చూస్తే ఏస్థాయిలో అక్రమార్జన చేస్తున్నాడో అర్థమవుతోంది.
ఆ మల్లన్నకే ఎరుక..!
శ్రీశైల దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌గా విధుల్లో చేరిన ఓ ఉద్యోగి అంచలంచెలుగా వాచ్‌మన్(హెల్పర్)గా రెగ్యులర్ అయ్యాడు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అక్కడి నుంచి నేరుగా ఓ విభాగానికి అధిపతి, ఏఈవో స్థాయి జీతం తీసుకుంటున్నాడు. సదరు ఉద్యోగి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం వచ్చే ఉన్నతాధికారులు, వ్యాపారులను, రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో దిట్ట. వారిని తనదైన మాటలతో మైమరపించి, దగ్గరుండి దర్శనాలు చేయించడంతో పాటు సకల సౌకర్యాలు, అవసరాలు తీరుస్తుంటాడు. తన ఉద్యోగం రెగ్యులర్ అయిన కొన్ని సంవత్సరాలకే శ్రీశైలంలో పట్టా భూమిని చేజిక్కించుకుని, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు రెండంతస్తుల భవనం రూ.కోటి వ్యయంతో నిర్మించాడు. తన పేరుతో పట్టా ఉంటే ఏసీబీ అధికారులకు దోరుకుతానేమోనని బినామి అయిన సమీప బంధువు పేరుతో పట్టా పొందాడు. తాను ఉన్న దేవస్థానం ఎల్‌ఐజీ క్వార్టర్‌ను అర్హత లేకపోకపోయిన తన బినామీ అయిన సమీప బంధువు, దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి అలాట్ చేయించాడు. పిల్లలను పెద్ద సిటీలో చదివించడంతో పాటు అమెరికా పంపించే స్థాయికి ఎదిగాడు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. సున్నిపెంటలో ఓ స్థలం, సొంత ఊరిలో పొలాలు, ఇతర పట్టణాల్లో సైతం స్థలాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా సంపాదించాడనేది ఆ మల్లన్నకే ఎరుక.
సతీమణి పేరుతో విద్యుత్ మీటర్
ఈ అధికారి తన సతీమణి పేరుతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండంతస్తుల భవనానికి విద్యుత్ మీటర్ తీసుకున్నాడు. బినామీ భవనానికి సతీమణి పేరుతో మూడు, నాలుగు మీటర్లు తీసుకుని విద్యుత్ శాఖ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు శాఖాపరంగా విచారిస్తే అసలు విషయం బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు.
బినామీ పట్టాతో
జీప్లస్–2 భవన నిర్మాణం
సతీమణి పేరుతోనే విద్యుత్ మీటర్లు
సొంత ఊర్లో పొలాలు..
ఇతర పట్టణాల్లో స్థలాలు
అక్రమార్జనతో యథేచ్ఛగా
ఫైనాన్స్ వ్యాపారం
బంగారం తాకట్టు, ఫైనాన్స్ వ్యాపారం
సదరు ఉద్యోగి వెనకేసుకున్న డబ్బుతో ఫైనాన్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. తనకు నమ్మకంగా ఉన్న వారికి వడ్డీలకు డబ్బు ఇవ్వడంతో పాటు బంగారం కూడా తాకట్టు పెట్టుకుంటున్నాడు. అడ్డదారిలో పదోన్నతులు, అక్రమ సంపాదనకు అలవాటు పడి శ్రీశైలం నుంచి దేవదాయశాఖ ఎప్పుడు బదిలీ చేసినా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ఈయనకు పరిపాటి. తన అనుభవంతో ఉన్నతస్థాయిలో చక్రం తిప్పుతుండటంతో ఆయనపై చర్యలకు ఎవరూ సాహించని పరిస్థితి నెలకొంది.


