
అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
● రూ.8లక్షలు విలువైన 56 ఫోన్లు స్వాధీనం
కోడుమూరు రూరల్: నలుగురు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల దొంగలను కోడుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 56 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం కోడుమూరు సీఐ తబ్రేజ్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం చిగుర్‌మాన్‌పేటకు చెందిన ఎరుకలి శశికుమార్, శ్రీను మరో ఇద్దరు మైనర్లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. నలుగురు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాల్లో చాకచక్యంగా సెల్‌ఫోన్లను దొంగలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే వారన్నారు. అనుమానంతో వీరిపై నిఘా పెట్టామన్నారు. సోమవారం ఉదయం కోడుమూరు ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో ఎస్‌ఐ ఎర్రిస్వామితో కలిసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 56 సెల్‌ఫోన్లన్ని కర్ణాటకలోని బళ్లారి, చిక్ బళ్లాపూర్, హొస్పేట్, బెంగళూరు ప్రాంతాల్లో దొంగలించినట్లు విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లన్నింటిని ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా బాధితులను పిలిపించి త్వరలో అందజేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ ఎర్రిస్వామి, ట్రైనీ ఎస్‌ఐ నీలకంఠ, సిబ్బంది పాల్గొన్నారు.