
‘పది’ సంతోషం.. దారిలోనే మాయం!
గోనెగండ్ల: పదో తరగతి పాసైన సంతోషంలో శ్రీశైలానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో విద్యార్థి మృత్యువాతపడ్డాడు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, విద్యార్థి కురువ కుమార్ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. వివరాలివీ.. ఎర్రబాడు గ్రామానికి చెందిన సునిల్‌కు భార్య సునిత, ఇద్దరు కుమారులు సంతానం. సునిల్‌కు బొలెరో వాహనం ఉంది. భార్య గ్రామంలో కూలీ పనులు చేస్తోంది. పెద్ద కుమారుడు కుమార్ సున్నిపెంటలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. చిన్న కుమారుడు గ్రామంలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కుమార్ 514 మార్కులు సాధించాడు. ఎర్రబాడు గ్రామానికి చెందిన చంద్రమ్మకు ఆదోనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ నేపథ్యంలో సునీల్ బొలెరో వాహనాన్ని ఆదోని చెందిన వారు శ్రీశైలానికి వెళ్లేందుకు బడుగకు మాట్లాడుకున్నారు. తన కుమారుడు కూడా పదిలో మంచి మార్కులు సాధించడంతో కుమార్‌ను కూడా తండ్రి సునీల్ తన వెంట తీసుకెళ్లాడు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం తిరిగి ఆదోనికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోగా బొలెరో టైరు జారింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కుమార్ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. శనివారం ఉదయం ఎర్రబాడు గ్రామంలో కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.
బొలెరో బోల్తా ఘటనలో ఐదుకు చేరిన మృతులు
ఎర్రబాడు గ్రామంలో అలుముకున్న విషాదం