
మహానందీశ్వరుడి సేవలో కలెక్టర్
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా దంపతులు పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి అలంకార మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, పండితులు కలెక్టర్ రాజకుమారి దంపతులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
పీజీఆర్‌ఎస్‌లో
110 ఫిర్యాదులు
బొమ్మలసత్రం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 110 ఫిర్యాదులు అందాయి. అర్జీదారుల నుంచి వినతులు అందుకున్న అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. చట్టపరమైన ఫిర్యాదులపై వెంటనే విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్‌ఎస్‌లో తమకు అందిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా స్టేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు రాలేని వారు సమీపంలోని స్టేషన్ అధికారులకు వినతులు సమర్పించవచ్చని ఎస్పీ సూచించారు.
ఎంపీడీఓలకు మండలాలు కేటాయింపు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓలు గా పదోన్నతులు పొందిన పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలకు మండలాలు కేటాయించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాలకు నియమితులైన ఎంపీడీఓలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా సీఈ ఓ నాసరరెడ్డి మాట్లాడుతూ బీవీ రమణారావును దేవనకొండ, బీ నూర్జహాన్‌ను మంత్రాలయం, కె.విజయశేఖర్‌రావును కౌతాళం, జి.ప్రభావతిదేవిని పెద్దకడుబూరు, ఎ.మద్దిలేటి స్వామిని ఆలూ రుకు నియమించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు 392 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన పరీక్షలకు 392 మంది గైర్హాజరయ్యారు. 3,384 మందికి 2,992 మంది ఛాత్రోపాధ్యాయులు హాజరు కాగా 392 మంది గైర్హాజరయ్యారని, వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు తెలిపారు.
డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్‌లు
● డీసీసీబీ చైర్మన్‌గా ఎదురూరు
విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా
నాగేశ్వరరావు యాదవ్
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు చైర్మన్‌లను ప్రకటించింది. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా కోడుమూరు నియోజకవర్గం ఎదురూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత డి.విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌గా డోన్ నియోజక వర్గం చండ్రపల్లి గ్రామానికి చెందిన జి.నాగేశ్వరరావు పేర్లను ప్రకటించారు. అయితే జీవోలు విడుదల కావాల్సి ఉంది.

మహానందీశ్వరుడి సేవలో కలెక్టర్