
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత
గోస్పాడు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్వో రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన 32,796 వినతుల్లో 30,985 పరిష్కారమయ్యాయన్నారు. రీఓపెన్ అయిన 59పై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న 1,811 వినతులకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పరిష్కార స్థితిపై కొత్త ట్యాగ్ విధానాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు.
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
వచ్చే 4వ తేదీన జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) యూజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్, టెక్కె జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు 1,172 మంది విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో అనుమతి ఇస్తారని నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల తో పాటు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన బెంచీలు ఏర్పాటు చేయాలని డీఈఓను సూచించారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి