ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది శనగ సాగు కలసి రాలేదు. తెగుళ్లు, తుఫాన్ ప్రభావంతో దిగుబడులు తగ్గాయి. మార్కెట్‌లో ధర లేకపోవడంతో దిగుబడులు అమ్ముకోలేని పరిస్థితులు తలెత్తాయి. జేజే–11 రకానికి రూ. 9 వేలు, తెల్లశనగకు రూ. 10 వేలు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను విక్రయించి ఆదుకోవాలి.
– గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు
మార్కెట్‌లో ధర లేదు
12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సొంత పొలంతో కలసి 20 ఎకరాకు శనగ పంట సాగు చేశాను. వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గిపోయాయి. తెల్ల శనగలో ఎకరాకు 5 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా రూ. 6,500 ధర పలుకుతోంది. ఈ ధరకు అమ్ముకోలేక పంట ఉత్పత్తులను గోదాములో భఽద్రపరుచుకున్నాను.
– అబ్రహం, రైతు, కంపమల్ల
గతేడాది ఇలా..
గత ఏడాది రబీ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో శనగసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఎకరాకు రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 3 నుంచి ఐదు క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. జేజే–11 రకం క్వింటా రూ. 8,500, ఫూలేజి రకం రూ. 10 వేల వరకు ధర పలకడంతో దిగు బడులు తగ్గినా మద్దతు ధరతో విక్రయించి నష్టాల ఊబి నుంచి గట్టెక్కారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఐదేళ్లపాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తకపోవడంతో దిగుబడులు గోదాములకే పరిమితయ్యాయి. శనగకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
● ఈ ఏడాది లభించని గిట్టుబాటు ధర
● శనగల బస్తాలతో గోదాములు ఫుల్
● కొనుగోలు కేంద్రాల ఊసెత్తని
రాష్ట్ర ప్రభుత్వం
● గతేడాది దిగుబడులు తగ్గినా
గిట్టుబాటు ధరలు
● ఈ ఏడాది ధర లేదని రైతుల ఆవేదన
కోవెలకుంట్ల: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల రెక్కల కష్టానికి కనీస విలువ ఇచ్చేవారు కరువయ్యారు. ఈ ఏడాది శనగ రైతులకు నష్టాలే మిగిలాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1.70 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగుచేశారు. కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో 93 వేల ఎకరాల్లో పంట సాగైంది. వర్షాభావ పరిస్థితులు, వివిధ దశల్లో తెగుళ్లు.. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. అరకొరగా పంట అందినా.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిండంలో విఫలం అయ్యింది. ఇప్పుడున్న మార్కెట్ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతుల దిగాలు
విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ.. తదితర పెట్టుబడుల రూపంలో ఎకరా శనగ సాగుకు రైతులు రూ. 20 వేలు వెచ్చించారు. కౌలు రూపంలో అదనంగా మరో రూ.15 వేలు భారం పడింది. వాతావరణం అనుకూలించక పోవడం.. ఫూలేజి(తెల్లశనగ) రకం పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించి పైరులో మొక్కలు ఎండిపోయాయి. తెగులుకు తోడు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలు, అధిక తేమ కారణంగా పైరు దెబ్బతినింది. వేలాది రూపా యలు పెట్టుబడులు వెచ్చింగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దెబ్బతిని రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగు బడులు వస్తాయనుకుంటే జేజే– 11 రకానికి చెందిన శనగలో ఎకరాకు 5 క్వింటాళ్లలోపు, పూలేజి రకంలో 4 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వచ్చాయి. దిగుబడులు అంతంత మాత్రంగానే రావడం, మార్కెట్‌లో ధర లేకపోవడంతో శనగ రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక, దిగుబడులు నిల్వ ఉంచుకునేందుకు బాడుగ రూపంలో అదనపు భారం పడుతుండటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు.
గోదాముల్లో శనగ బస్తాలు
జేజే–11 రకం క్వింటా రూ. 5,500, ఫూలేజి రకం రూ. 6,500 మాత్రమే ధర ఉంది. ఈ ధరకు విక్రయించలేక పంట ఉత్పత్తులను గోదాములకు తరలించి భద్ర పరుచుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 150 గోదాములు ఉన్నాయి. ఒక్కో గోదాములో 80 వేల బస్తాల నుంచి లక్ష బస్తాలు నిల్వ ఉంచవచ్చు. ఉత్పత్తులు భద్రపరుచుకునే రైతులు ఒక్కో బస్తాకు ఏడాది రూ. 100 ప్రకారం బాడుగ చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని గోదాములు శనగ బస్తాల నిల్వతో నిండిపోయాయి. మరికొందరు ఇళ్లలోనే పంట ఉత్పత్తులను భద్రపరుచుకున్నారు.
కొనుగోలు కేంద్రాల
ప్రతిపాదన లేదు
ఈ ఏడాది శనగ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతులు ప్రస్తుత మార్కె ట్ ధర ప్రకారం దిగుబడులను విక్రయించుకోవచ్చు. ఫూలేజి (తెల్లరకం)కి ప్రభుత్వ మద్దతు ధర ఉండదు. మార్కెట్ ధరల ప్రకారం అమ్మకాలుజరుపుకోవాలి.
– నిరంజన్, మండల వ్యవసాయాధికారి, కోవెలకుంట్ల
శనగల ధరలు ఇలా..
రకం గతేడాది ప్రస్తుతం ఉన్న
ధర ధర
జేజే–11 రూ.8,500 రూ.5,500
ఫూలేజి రూ.10,000 రూ.6,500
శనగ రైతుకు ‘ధరా’ఘాతం
శనగ రైతుకు ‘ధరా’ఘాతం
శనగ రైతుకు ‘ధరా’ఘాతం