వైద్య మిత్ర.. ఉద్యోగ భద్రత మిథ్య | - | Sakshi
Sakshi News home page

వైద్య మిత్ర.. ఉద్యోగ భద్రత మిథ్య

Mar 4 2025 12:55 AM | Updated on Mar 4 2025 12:54 AM

ప్రభుత్వ పథకాలకూ దూరం..

ఆరోగ్యమిత్రలకు అరకొర జీతమిస్తూ ప్రభుత్వ పథకాలనుసైతం నిలిపివేసిన పరిస్థితి ఉంది. సీఎఫ్‌ఎంఎస్‌లో వేతనాలే ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి ఆరోగ్యమిత్ర కుటుంబాలను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించింది. దీంతో వీరి కుటుంబాలలో పెద్దలకు సామాజిక పింఛన్లు, ఇతర ఏ ఒక్క పథకానికి అర్హత లేదు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, కుటుంబపోషణ భారంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

గోస్పాడు: కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌) పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకె ళ్లేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో వైద్యమిత్రలు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసే ఉద్యోగులను ఆప్కాస్‌ (ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్సింగ్‌ సర్వీస్‌) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ ద్వారా ప్రతి నెల విధిగా వేతనం ఇవ్వడంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించారు. అప్పట్లోనే డిగ్రీ పూర్తి చేసిన వారిని విధుల్లోకి తీసుకొని ఆరోగ్యశ్రీ సేవల్లో నియమించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవను బీమా పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండటంతో వారంతా ఆందోళకు గురవుతున్నారు. జిల్లాలో 101 ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. వాటిలో 49 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, 38 ప్రైవేటు నెట్‌వర్క్‌, ఇతర ఆసుపత్రులలో 67 మంది వైద్యమిత్రలు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సుమారు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది డిగ్రీతోపాటు పీజీలు చేసిన వారున్నారు. వైద్యమిత్రలతో పాటు జిల్లాలో టీమ్‌ లీడర్లు ఆరుగురు, ఆఫీస్‌ అసోసియేట్‌గా ఒకరు పనిచేస్తున్నారు. తమను బీమా సంస్థల పరిధిలోకి తీసుకొస్తే తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిపోతుందని వైద్య మిత్రలు, ఇతర సిబ్బంది వాపోతున్నారు.

17 ఏళ్లుగా సేవలందిస్తూ..

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్యమిత్రలు పర్యవేక్షిస్తుంటారు. వైద్య శాలలకు వచ్చిన పేద ప్రజలకు వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి సేవలందిస్తున్నారు. వీరితోపాటు ఉద్యోగుల హెల్త్‌కార్డులు, జర్నలిస్ట్‌ హెల్త్‌కార్డులు, ఆరోగ్య రక్ష స్కీమ్‌కు సంబంధించి సేవలందిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో దాదాపు 17 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయస్సు ప్రస్తుతం చాలా మందికి 50 సంవత్సరాలు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్తే ఎవరిని ఉంచుతారో, ఎవరిని తొలగిస్తారోనని ఆందోళనగా ఉంది. అయితే ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్న వైద్యమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయంలో వెయిటేజీ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వైద్యమిత్రలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఆందోళనలో..

ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ తరఫున అందించే ఆరోగ్య సేవలను బీమా (ఇన్సూరెన్స్‌) పరిధిలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు అనేక సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. తమను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుతారా.. తొలగిస్తారనే అయోమయంలో ఉద్యోగులు ఉన్నారు. భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో వారు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ ప్రైవేటుకు అప్పగిస్తే ఎన్నో ఏళ్లుగా విధులు చేస్తున్న సర్వీస్‌ మొత్తం ఎందుకూ పనికిరాకుండా పోతుందనే ఆందోళన వారిని వేధిస్తోంది.

ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు

అప్పగించే యోచనలో ప్రభుత్వం

జిల్లాలో 101 ఆసుపత్రుల్లో

67 మంది వైద్య మిత్రలు

ఆందోళన చెందుతున్న ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement