
కొలనుభారతి అమ్మవారిని దర్శించుకున్న లోకాయుక్త జస్టీస్ దంపతులు
కొత్తపల్లి: కార్తీక మాసం పురస్కరించుకుని మండలంలోని కొలనుభారతిదేవి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయాన్ని చేరుకున్న వారికి పురోహితులు ఆలయ సంప్రదాయానుసారం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించుకొన్నారు. అదేవిధంగా అక్కడే ఉన్న సప్తశివాలయాలలోని దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఆలయ ఈఓ మోహన్ జస్టిస్ దంపతులను పూలమాల దుశ్శాలువలతో సత్కరించారు. ఈయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ ఉన్నారు.
నేడు జగనన్నకు చెబుదాం – స్పందన
● జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో సోమవారం వినూత్న తరహాలో ‘జగనన్నకు చెబుదాం–స్పందన‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ఈ కార్యక్రమానికి జిల్లాధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా యథాతధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
837.20 అడుగులుగా డ్యామ్ నీటిమట్టం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 837.20 అడుగులకు చేరుకుంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిన విషయంతెలిసిందే. శనివారం నుంచి ఆదివారం వరకు దిగువ ప్రాంతాలకు 3,674 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భజలవిద్యుత్‌త్ కేంద్రంలో 0.974 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, 1982 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. హంద్రీనీవా సుజలస్రవంతికి 960 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 647 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 57.8098 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇండస్ట్రియల్ హబ్‌గా ఓర్వకల్లు
● ఐలా చైర్మన్ జీఆర్‌కే రెడ్డి
కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ), ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీ (ఐలా) చైర్మన్ జీఆర్‌కే రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు వేలాది ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం ఓర్వకల్లును అభివృద్ధి చేస్తోందన్నారు. ఏవైనా పరిశ్రమలు రావాలంటే నీరు ముఖ్యమని, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో ముచ్చుమర్రి నుంచి పైపులైన్ ద్వారా నీటిని కేటాయించడం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. యువత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలన్నారు. ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పించడం, జిల్లాలో డ్రైపోర్ట్, పారిశ్రామిక వాడల అభివృద్ధిలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్‌గా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కమిటీ మెంబర్‌గా తాను తీసుకెళ్లిన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభపరిణామమన్నారు.
వైభవంగా పద్మనాభ పూర్వారాధన
మంత్రాలయం: మధ్వమత పూర్వపు పీఠాధిపతి పద్మనాభతీర్థుల 700వ ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. కర్ణాటకలోని అనేగొంది నవబృందావన క్షేత్రంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేతుల మీదుగా వేడుకలు నిర్వహించారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం పూర్వరాధన వేడుక గావించారు. ముందుగా పద్మనాభతీర్థుల మూలబృందావనానికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేపట్టి విశేష అలంకరణలు చేశారు. పండితుల మంత్రోచ్ఛణాల మధ్య పూర్వారాధన కనుల పండువగా సాగింది.