వీధుల్లో చెత్త ఎందుకు వేస్తున్నారు..
నల్లగొండ టూటౌన్ : కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కొత్త కలెక్టర్ రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు, సిబ్బందికి చలిలో చెమటలు పట్టాయి. అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే కొత్త కలెక్టర్ చంద్రశేఖర్ నీలగిరి పట్టణంలోని 28వ వార్డులో శనివారం ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రత్యక్షమయ్యారు. వార్డులోని శ్రీకృష్ణానగర్‌లో కలియదిరుగుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. చెత్త ట్రాక్టర్ సమయం ప్రకారం వస్తుందా.. వస్తుంటే మీరెందుకు వీధుల్లో చెత్త వేస్తున్నారని కలెక్టర్ అక్కడి మహిళలను ప్రశ్నించారు. ఇక నుంచి చెత్తను వీధుల్లో.. రోడ్ల వెంట వేస్తే భారీగా జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇంట్లోని చెత్తా చెదారాన్ని మున్సిపల్ వాహనంలోని సిబ్బందికి అందించాలని మహిళలకు సూచించారు. తాగునీరు ఎంత సేపు వస్తుంది, ఏ సమయంలో వస్తుంది.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో ఎక్కడా లోపాలు రావద్దని సంబంధిత అధికారులకు సూచించారు. ఆస్తి పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండాలని, వార్డు ఆఫీసర్లకు రోజు వారి టార్గెట్ విధించి వంద శాతం పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు. అదే కాలనీలో ఉన్న మోతి కుంటను కలెక్టర్ పరిశీలించారు. కట్ట, కుంటలో నీటికి సంబంధించి అధికారులను ఆరా తీశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, ప్రదీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ చెత్త ట్రాక్టర్ రోజూ రావడం లేదా
ఫ కాలనీ వాసులను ప్రశ్నించిన కలెక్టర్
ఫ నీలగిరి 28వ వార్డులో ఉదయం 7 గంటలకే కొత్త పర్యటన
ఫ తాగునీరు, శానిటేషన్‌పై ఆరా
ఫ రోడ్లపై చెత్త వేస్తే జరిమానా వేయాలని అధికారులకు ఆదేశం
వీధుల్లో చెత్త ఎందుకు వేస్తున్నారు..


