ధ్యానంతో మానసిక ప్రశాంతత
నల్లగొండ టూటౌన్ : రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా కన్హా హార్ట్‌ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక సమతుల్యత వస్తుందని, నిత్య సాధనతో ఉత్సాహంగా పని చేయవచ్చన్నారు. ధ్యాన దినోత్సవం ప్రధాన లక్ష్యం శాంతి కరుణ, ఐక్యత అని పేర్కొన్నారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగారెడ్డి, వెంకటాచారి, నారాయణరెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు హాలియాకు కేటీఆర్ రాక
హాలియా : బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ నెల 20న (శనివారం) హాలియా పట్టణానికి రానున్నారు. పంచాయతీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు హాలియాలోని లక్ష్మీనర్సింహ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరగనున్న ఈ అభినందన సత్కార కార్యక్రమానికి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులు హాజరుకానున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
యువజన సంఘాల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రీడా సామగ్రి పంపిణీకి యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారి గంట రాజేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెహ్రూ యువ కేంద్రంలో అనుసంధానమైన యువజన సంఘాల వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు గత ఐదేళ్ల నుంచి సంఘాలు చేసిన కార్యక్రమాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాపీని జత పర్చాలని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 91338 96009, 90597 98602 నంబర్లను సంప్రదించాలని కోరారు.
పోలీసులు తీరు దారుణం
నల్లగొండ టూటౌన్ : జిల్లాలో పోలీసుల తీరు దారుణంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపైకి దాడికి వస్తుంటే తనను హౌస్ అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంపై దాడి చేయాలంటూ పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను వదిలేసి, బీజేపీ నాయకులను నిర్భందించడం విడ్డూరంగా ఉందని మడ్డిపడ్డారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కనగల్: మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని డీఈఓ బి.భిక్షపతి ఆదేశించారు. గురువారం కనగల్ మండలం జి.యడవల్లి ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి బోధన అభ్యసన అమలు తీరును తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం విజయలక్ష్మి , సీఆర్‌పీటీ సంతోష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధ్యానంతో మానసిక ప్రశాంతత


