నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనాలి
పెద్దవూర : తాలు, తరుగు లేకుండా 17శాతం తేమతో నాణ్యతాప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పెద్దవూర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యాన్ని తూర్పారబట్టాలని, ప్రస్తుతం మంచు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం మీద పట్టాలు కప్పి ఉంచాలని రైతులకు సూచించారు. అధికారులు తేమ శాతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు పూర్తిచేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్ల వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 107 లారీల ధాన్యం కొనుగోలు చేయగా అందులో 23,400 క్వింటాళ్ల సన్నధాన్యం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి, ఉంపీడీఓ ఉషాదేవి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


