సైబర్ దోపిడీ..
ఆన్‌లైన్ మోసాలకు గురికావద్దు
జిల్లాపై సైబర్ పంజా విసురుతోంది. ఆధునీక పద్ధతుల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. వీరు, వారు అనే తేడా లేకుండా అందరినీ మోసగిస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. చివరికి పోలీసులను సైతం సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. సైబర్ నేరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఆ కేసులను చేధించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసాల్లో తొలుత పెద్ద ఎత్తున నగదును పోగొట్టుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండడం లేదు.
గత ఏడాది మిర్యాలగూడకు చెందిన ఓ నాయకుడు కొందరి పేర్లతో ఖాతాలు తెరిపించి ముంబై, దుబాయ్‌లోని సైబర్ నేరగాళ్లకు ఆ ఖాతాల వివరాలు అందించి ఖాతాదారుల అకౌంట్లలో సైబర్ నేరాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయించాడు. కొంత మొత్తం ఖాతాదారులకు కమీషన్ ఇచ్చి కోట్ల రూపాయలను స్వాహా చేసినట్లు వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులను పోగొట్టుకుని సులువుగా డబ్బులు సంపాదించాలని సైబర్ నేరాలకు పాల్పడుతూ జిల్లా పోలీసులకు చిక్కారు. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన మరొకరు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు.
సైబర్ మోసాల్లో బాధితులు కోట్ల రూపాయలను కోల్పోతున్నారు. డబ్బులు పోయాక పోలీసులను ఆశ్రయించినా, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చెసినా రికవరీ పెద్దగా ఉండడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.681కోట్లు బాధితులు నష్టపోగా కేవలం రూ.107కోట్లు మాత్రమే రికవరి అయినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6,848 మంది బాధితులకు రూ.53.5కోట్లు తిరిగి ఇప్పించారు.
మిర్యాలగూడ : జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు.. ఆన్‌లైన్‌లో చదువుకున్న వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్, ఆధార్ నంబర్లు సేకరించి వారికి నేరుగా వాట్సప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. మొత్తంగా అమాయకులతోపాటు చదువుకున్న వారిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఇటీవల జరిగిన మోసాలు..
● ఐదు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాడు వాట్సప్ కాల్ చేసి మీపై ఫోక్సో కేసు నమోదు అయిందని, అంతర్జాతీయ క్రిమినల్స్‌తో మీకు సంబంధం ఉందని నమ్మించి బెదిరించాడు. సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించానని, దీనికి గాను రూ.30,70,719 చెల్లించాలని అది కూడా ఆర్టీజీఎస్ చేయాలని చెప్పాడు. అంత డబ్బు తన వద్ద లేవని తాను ఏ తప్పూ చేయలేదని ప్రాధేయపడినా చివరికి రూ.20లక్షలు చెల్లిస్తే.. మిగతావి నేను చెల్లిస్తానని నమ్మబలికి మూడు రోజులు మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో వారు ఓ మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఎస్పీని ఆశ్రయించడంతో సైబర్ నేరమని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
● నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మీపై కేసు నమోదు అయిందని దాని నుంచి బెయిల్ రావాలంటే తక్షణమే రూ.35 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాడు బెదిరించారు. అది నమ్మిన బాధితుడు నగదు చెల్లించాడు. ఆ నగదు సరిపోదని ఇంకా కావాలని అడగంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదవ పెట్టేందుకు వెళ్తుండగా తెలిసిన కానిస్టేబుల్ కలవడంతో విషయం చెప్పాడు. వెంటనే బాధితుడ్ని క్రైం ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పడంతో సైబర్ నేరమని తేలింది.
● ఈ ఏడాది జనవరిలో జిల్లాకు చెందిన 57 ఏండ్ల ప్రభుత్వ ఉద్యోగికి ఓ వ్యక్తి పోలీసు అధికారిగా ఫోన్ చేసి రూ.2 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అతని ఆధార్‌కార్డును ఉపయోగించారని, వాట్సప్‌లో మొదటగా అరెస్ట్ వారెంట్, కోర్టు ఆర్డర్లు పంపి భయపెట్టి అతని వద్ద రూ.6.5లక్షలు కాజేశారు.
● ఈ ఏడాది మార్చి 29న నల్లగొండ జిల్లాలో సైబర్ కేసు నమోదైంది. అందులో హైదరాబాద్‌కు చెందిన 49 ఏండ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగికి.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ట్రాయ్ అధికారిగా వీడియో కాల్ చేసి బెదిరించి అతని వద్ద రూ.8.5లక్షలు
కాజేశారు.
● ఏడాది మార్చిలో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా న్యూడ్ వీడియోకాల్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన చోటు చేసుకుంది.
● నార్కట్‌పల్లి మండలంలో సైబర్ మోసాలకు గురై ఒకరు రూ.30 లక్షలు పోగొట్టుకున్నారు.
● గత నెలలో వాడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో లోన్ యాప్‌ను ఓపెన్ చేయగా అతని ఖాతా నుంచి రూ.2 లక్షలకు పైగా మాయమయ్యాయి. ఈ విషయంపై వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఫ కేసులు నమోదయ్యాయని వాట్సప్ కాల్
ద్వారా సైబర్ నేరగాళ్ల బెరింపులు
ఫ రూ.లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులు
ఫ మోసపోయే వారిలో ఎక్కువగా ఉద్యోగులు, మేధావులే
ఫ అవగాహన లోపమే కారణం
ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరిట ఎవరూ ఫోన్లు, వాట్సప్ కాల్ చేయరు. తప్పుడు కేసులు, అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరిస్తారు అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, ఓటీపీ ఇవ్వకూడదు. అలాంటి ఫోన్‌కాల్స్‌కు భయపడవద్దు. అనుమానం వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
– రాజశేఖర్‌రాజు, డీఎస్పీ, మిర్యాలగూడ
సైబర్ దోపిడీ..


