
ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
కనగల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి.. వర్షాకాలంలోపు గృహ ప్రవేశాలు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం కనగల్ మండలం తేలకంటిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తేలకంటిగూడెంలో 107 ఇళ్లను మంజూరు చేశామని.. ఇందులో 71 ఇళ్లు గ్రౌండింగ్ కాగా, ప్రస్తుతం 48 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో, రెండు రూఫ్ స్థాయిలో ఉన్నాయన్నారు. 44 ఇండ్లకు బేస్మెంట్ బిల్లులు చెల్లించామన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు.. కలెక్టర్‌తో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి గుడిసెల్లో జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడమే కాకుండా, ఇంత త్వరగా ఇండ్లు కట్టించి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి, కలెక్టర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ బోగారి రాంబాబు తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి