
మన్నెవారిపల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
అంతర్రాష్ట్ర దొంగను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.10లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
బలితీసుకున్న భూ వివాదం
పోలీస్‌స్టేషన్ మెట్లెక్కిన భూ వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
సోమవారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2023
- 8లో
జిల్లా నుంచి ఇద్దరికి కీలక శాఖలు
ఫ ఒకరు గతంలో ప్రాజెక్టులు మంజూరు చేయిస్తే.. మరొకరు ఇప్పుడు వాటిని పూర్తి చేసే మంత్రిగా బాధ్యతలు
ఫ శ్రీశైలం సొరంగం పనుల్లో కదలిక వచ్చే అవకాశం
ఫ బ్రాహ్మణ వెల్లెంల, ఎత్తిపోతల పథకాలకూ మంచి రోజులు
ఎత్తిపోతల పనుల్లో కదలిక వచ్చేనా
సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో నెల్లికల్‌తోపాటు మరో 14 ఎత్తిపోతల పథకాలకు అప్పటి సీఎం కేసీఆర్ శంకు స్థాపన చేసి నిధులను మంజూరు చేశారు.అయితే వాటి పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. 2021 ఫిబ్రవరిలో వాటికి శంకుస్థాపన చేసినా ఇంతవరకు సగం పనులు కూడా కాలేదు. పీఏపల్లి మండలంలోని పెద్దగట్టు ఎత్తిపోతలకు అనుమతులే రాకపోగా, పొగిళ్ల తదితర లిఫ్ట్‌ల పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఏకేబీఆర్ ఎత్తిపోతల, కంబాలపల్లి, చందంపేట మండలంలోని అంభాభవాని ఎత్తిపోతల పథకాలు, మిర్యాలగూడ పరిధిలో తోపుచర్ల, వీర్లపాలెం, కేశవాపురం, బొత్తల పాలెం, దున్న పోతులగండి, నకిరేకల్‌లో అయిటిపాముల ఎత్తిపోతల, పాలకవీడు మండలంలో జాన్‌పహాడ్ ఎత్తిపోతల, చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద లిఫ్ట్ చేసి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఎత్తిపోసే పథకం పనులు అలాగే ఉండిపోయాయి. మరోవైపు బస్వాపురం రిజర్వాయర్, కాలువల పనులు పూర్తి చేయడం, గోదావరి జలాలను కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు పూర్తిస్థాయిలో తీసుకువచ్చే కార్యాచరణపైనా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కీలక శాఖలు కేటాయించడంతో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో పట్టుబట్టి ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి కావడం, జిల్లాకే చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటిపారుదల శాఖ ఇవ్వడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. వారి నేతృత్వంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మంచి రోజులు రానున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని మంజూరు చేయించారు. అలాగే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును మంజూరు చేయించిన ఘనత కోమటిరెడ్డిదే. ఈ రెండు ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైనవే. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగిన ఆ రెండు ప్రాజెక్టులతోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నెల్లికల్, అయిటిపాముల సహా 15 ఎత్తిపోతల పథకాల పనుల్లో ఇప్పుడు వేగం పుంజుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
టన్నెల్ పనులు పుంజుకునేనా..
శ్రీశైలం బ్యాక్ వాటర్‌నుంచి సొరంగ మార్గం ద్వారా నల్లగొండ జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2007 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒప్పించి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు మంజూరు చేయించారు. అప్పట్లో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1925 కోట్లు కాగా, ప్రస్తుతం అది రూ. 4557 కోట్లకు చేరింది. అయితే అప్పటి నుంచి 2014 వరకు ఏడేళ్లలో వేగంగా సాగిన టన్నెల్ పనుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక జాప్యం చోటు చేసుకుంది. ఇందుకు ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల కొంత అలసత్వం ప్రదర్శించడం ఒక కారణమైతే, టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) పాడైపోవడం, దానికి మరమ్మతులు చేయడంలో ఆలస్యం కావడం మరో కారణం. దీంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగింది. ఈ ప్రాజెక్టు పనులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమారెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి కావడం, ఆ ప్రాజెక్టును మంజూరు చేయించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా రోడ్లు భవనాల శాఖ మంత్రి కావడంతో ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఏడేళ్లలో 23 కిలో మీటర్లు.. 11.300 కిలోమీటర్లు
ప్రాజెక్టు మంజూరు చేసిన ఏడేళ్లలో అప్పటి ప్రభుత్వం వేగంగా పనులు చేపట్టింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (ఇన్‌లెట్) నుంచి దోమలపెంట వద్ద పనులు చేపట్టగా, నల్లగొండ జిల్లా పరిధిలోని మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ (ఔట్‌లెట్) పనులను ప్రారంభించారు. జిల్లాలో 43.930 కిలో మీటర్లు టెన్నల్ తవ్వాల్సి ఉంది. 2007లో పనులు ప్రారంభమైనప్పటి నుంచి 2014 మే నెల వరకు 23 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వితే, ఆ తరువాత నుంచి ఇప్పటివరకు తొమ్మిదిన్నరేళ్లలో 11.370 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకమే పూర్తయింది. మొత్తంగా ఇప్పటివరకు 34.37 కిలో మీటర్ల మేర టన్నెల్ పూర్తికాగా ఇంకా 9.56 కిలో మీటర్ల పొడవున టన్నెల్ తవ్వాల్సి ఉంది.తెలంగాణ ఏర్పడకముందు ప్రాజెక్టు వ్యయం రూ.1,925 కోట్లలో రూ.1,279 కోట్లు ఖర్చు చేయగా, తెలంగాణ వచ్చాక అప్పట్లో మంజూరు చేసిన రూ. 1432 కోట్లు కలిపి మొత్తంగా రూ.2,711 కోట్లు ఖర్చు చేసింది. అయినా టన్నెల్ పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. టన్నెల్ పూర్తి చేసేందుకు ఇంకా రూ. 1,846 కోట్ల అవసరం ఉంది.
ఏప్రిల్ నుంచే ఆగిపోయిన పనులు
టన్నెల్ తవ్వకంలో ప్రధానమైన టీబీఎంలో ఏర్పడిన సాంకేతిక లోపాలు, విద్యుత్ చార్జీలు, కార్మికుల బకాయిలు తదితర సమస్యతో గత ఏప్రిల్ నుంచే పనులు ఆగిపోయాయి. దానికి కావాల్సిన బేరింగ్‌లు జర్మనీ నుంచి తెప్పించాల్సి ఉండగా యంత్రాంగం, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో జాప్యం జరుగుతోంది. దీంతో అందులో పనిచేస్తున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. సొరంగం పూర్తి చేసి నక్కలగండి ప్రాజెక్టును నింపితే దేవరకొండతో పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లోని 516 గ్రామాలకు తాగునీటిని అందించవచ్చు. జిల్లా మంత్రులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తారని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
న్యూస్‌రీల్
పట్టించుకుంటే పూర్తి కానున్న బ్రాహ్మణ వెల్ల్లెంల
‘నాకు మంత్రి పదవి వద్దు.. ప్రాజెక్టు కావాలి’ అని పట్టుపట్టి 2007లో ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లెంలలో రూ.699 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పథకాన్ని ప్రారంభించారు. నార్కట్‌పల్లి, మునుగోడు, చిట్యాల, కట్టంగూరు, నల్లగొండ ఐదు మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. 15 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. పడుతూ లేస్తూ 10 కిలోమీటర్ల పొడవున సొరంగం, రిజర్వాయర్, పంప్‌హౌస్, పవర్ స్టేషన్ వంటి పనులను పూర్తి చేశారు. కానీ ప్రధాన కాల్వల పనులు చేయలేదు. వాటికి సంబంధించిన భూ సేకరణ పూర్తి కాలేదు.
డిండికి నీటి కేటాయింపుపైనా రాని స్పష్టత
జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్‌లోని దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు రంగారెడ్డి అంతర్భాగంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. కృష్ణా జలాల నీటి వాటాలు తేలకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి గందరగోళంగా మారింది. దానికింద నిర్మిస్తున్న సింగరాజుపల్లి (డిండి మండలం), గొట్టిముక్కల (దేవరకొండ మండలం), కిష్టరాయినిపల్లి, చింతపల్లి (చింతపల్లి మండలం), శివన్నగూడెం (మర్రిగూడ మండలం) రిజర్వాయర్లకు సంబంధించిన పరిహారం విషయంలో ఉన్న వివాదాలను పరిష్కరించాల్సి ఉంది. మరోవైపు నీటి కేటాయింపుపై స్పష్టత లేక వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కొనసాగుతున్న వెల్లటూరు ఎత్తిపోతల పనులు


నాగార్జునసాగర్ జలాశయ తీరాన కొనసాగుతున్న నెల్లికల్లు ఎత్తిపోతల పనులు