
క్లాక్ టవర్ సెంటర్‌లో ఫ్లకార్డులతో నిరసన దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
ఫ టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్
ఫ నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష
నల్లగొండ : పార్లమెంట్‌లో ప్రతిపక్షం లేకుండా చేయడానికే బీజేపీ రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఆకట్టుకోగలిగారని.. దాన్ని జీర్ణించుకోలేక బీజేపీ.. కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాహుల్ సభ్యత్వ రద్దును వ్యతిరేకిస్తూ 18 పార్టీలు తీర్మాణం చేశాయని అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారని చెప్పారు. కొందరు నేతలు ఓబీసీలను కించపరిచారని మాట్లాడుతున్నారని, లలిత్‌మోడీ, నీరోమోడీ బీసీలు కారని పేర్కొన్నారు. కుల గణన చేపట్టాలని అంటే పట్టించుకోని వారి కులాల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో సభ్యత్వాన్ని కుట్రపూరితంగా రద్దు చేశారని మండిపడ్డారు. ఏం చేసిన రాహుల్‌గాంధీ భయపడరని, దేశప్రజలంతా త్యాగాల కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ దీక్షలో నాయకులు తండు సైదులుగౌడ్, సుమన్, పరమేష్, సుభాష్, సైదిరెడ్డి, కార్తిక్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సుధాకర్ ప్రసంగిస్తుండగా వెళ్లిపోయిన కోమటిరెడ్డి వర్గం..
పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సభకు రాగానే కోమటిరెడ్డి వర్గం వెళ్లిపోతుండగా డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ సముదాయించి కూర్చోబెట్టారు. ఆ తర్వాత చెరుకు సుధాకర్ మాట్లాడుతుండగా జై కోమటిరెడ్డి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీని కాపాడుకునేందుకు అందరం కలిసే పని చేద్దామని.. గాంధీ భవన్‌లో కూడా కోమటిరెడ్డితో కలిసే దీక్షలో పాల్గొన్నామంటూ చెరుకు సుధాకర్ మాట్లాడుతున్నప్పటికీ కోమటిరెడ్డి వర్గీయులు కొందరు వెళ్లిపోయారు. ఆ తర్వాత చెరుకు సుధాకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాద్యక్షుడు చెరుకు సుధాకర్