
ఆలేరురూరల్ : రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలేరులో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలేరు పట్టణానికి చెందిన కటకం బాలరాజు(25) స్థానికంగా మటన్ దుకాణం నిర్వహిస్తున్నాడు.ఉదయ 6 గంటల సమయంలో బాలరాజు ఆలేరు పట్టణ శివారులోని ఆర్వోబీ వద్దకు వచ్చాడు. రైలు పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు బాలరాజుపై నుంచి వెళ్లగా తల, మొండెం వేరుకావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు భువనగిరి రైల్వే పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్ సత్యనారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతోనే బాలరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చింత పండు దులపబోయి..
ఫ చెట్టుపైనుంచి పడి
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మృతి
నార్కట్‌పల్లి : చింతపండు దులిపేందుకు చెట్టు ఎక్కిన ఓ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి మృతిచెందాడు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్‌పల్లికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి సామ యాదగిరిరెడ్డి (62) ఆదివారం స్థానిక తన వ్యవసాయ భూమి వద్ద చింతపండు దులిపేందుకు చెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో కాలు జారి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానిక రైతులు అతడిని తొలుత నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య మనోరమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
లాడ్జీలో ఆత్మహత్య
ఫ మృతుడు సూర్యాపేట వాసి
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ లాడ్జీలో సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సోమవారం రాత్రి గుర్తించిన సిబ్బంది ఖమ్మం వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూర్యాపేటకు చెందిన అప్పం నిహార్ ఖమ్మంలోని స్టేషన్ రోడ్డులో గల ఓ లాడ్జీలో ఆదివారం గది అద్దెకు తీసుకున్నాడు. ఆయన సోమవారం గదిలో ఉరివేసుకోగా, పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో నే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
చండూరు వాసికి డాక్టరేట్
చండూరు : చండూరు పట్టణానికి చెందిన గన్నవరం నిర్మలకు ఉస్మానియా యూనివర్సిటీ సోమవారం డాక్టరేట్ ప్రకటించింది. నిర్మల ఉస్మానియా తెలుగు శాఖ నుంచి ఆచార్య సాగి కమాలాకర్ శర్మ పర్యవేక్షణలో ముకురాల రామిరెడ్డి సాహిత్యం –సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ లభించింది. ప్రస్తుతం నిర్మల దేవరకొండ కేజీబీవీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.