మిర్యాలగూడ అర్భన్ : సరైన వైద్య సేవలు అందని కారణంగానే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం పట్టణంలోని ఓ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన ధీరావత్ మల్లు (43) గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న మల్లు సోమవారం మృతిచెందాడు. సరైన చికిత్స అందకపోవడంతోనే మల్లు మృతిచెందాడని కుటుంబ సభ్యులు కొంత సేపు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. పెద్దల జోక్యంతో విరమించారు.