ఖరీఫ్ సందడి మొదలైంది..
వాన కురిసింది..
శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలు
● నల్లమలలో అత్యధికంగా
81.8 మి.మీ., వర్షపాతం నమోదు
● పొంగిపొర్లిన చంద్రవాగు,
చెంచుపల్గుతండా మార్గం
● అచ్చంపేట తుమ్మలకుంటలో
నీట మునిగిన 33/11 కేవీ సబ్‌స్టేషన్
● జిల్లాలో ఊపందుకోనున్న
వ్యవసాయ పనులు
బల్మూర్ మండలం మైలారంలో పత్తి విత్తనాలు విత్తుతున్న మహిళలు
అచ్చంపేటలోని తుమ్మలకుంటలో నీట మునిగిన సబ్‌స్టేషన్
పొంగిపొర్లుతున్న చంద్రవాగు
ఉప్పునుంతల మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగులు పారాయి. ఉప్పునుంతల మహాసముద్రం చెరువు, వెల్టూరు చెరువు, కాంసానిపల్లి మర్యాద సముద్రం చెరువు, చీకటివాగు తదితర చెరువులు, కుంటలు అలుగులు పారాయి. ఉప్పునుంతల– అచ్చంపేట రహదారిలో మల్లప్పవాగు ప్రాంతంలో వరదనీరు రోడ్డుపై పారుతుంది. దీంతో ప్రజలు అలుగులు పారిన నీటిలో చేపలు పడుతూ కనిపించారు.
అచ్చంపేట/ ఉప్పునుంతల/ తాడూరు: జిల్లాలో తొలకరి వర్షాలు పలకరించడంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నల్లమలలో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు అరకలు, ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుక్కులు దున్నిన రైతులు పత్తి గింజలు వేస్తున్నారు. సాగుకు అనుకూలనమైన వర్షాలు పడటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అదును కోసం ఎదురుచూసిన రైతన్నలు వర్షం రాకతో వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది రైతులు కురిసిన కొద్దిపాటి వర్షానికి విత్తనాలు నాటుకోగా.. వర్షం అనుకూలంగా ఉండటంతో మొలకలు ఇబ్బందిలేకుండా మొలుస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఉప్పొంగిన చంద్రవాగు
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి నల్లమలలో కురిసిన భారీ వర్షానికి చంద్రవాగు పొంగిపొర్లుతుంది. దీంతో చంద్రసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుంది. ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నల్లమలలో సగటున 81.8 మి.మీ., వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా ఉప్పునుంతల మండలం వెల్టూరులో 105.8 మి.మీ., వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో ఇప్పటికే రైతులు విత్తిన విత్తనాలు నీట మునిగి కొట్టుకుపోయాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న చంద్రవాగు వెంట ఉన్న లో లెవల్ వంతెనలను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఈ వాగు వల్ల చౌటపల్లి, బాణాల, బిల్లకల్లు, చెంచుగూడెంలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైలెవల్ వంతెన మంజూరు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కను ఎమ్మెల్యే ఫోన్‌లో కోరారు. అలాగే అచ్చంపేట పట్టణంలోని తుమ్మలకుంటకు భారీగా నీరు వచ్చి చేరడంతో అచ్చంపేట– చౌటపల్లి రోడ్డులో తుమ్మలకుంట శిఖం భూమిలో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ నీట మునిగింది.
తాడూరు మండలం
గుంతకోడూరు
శివారులో అరక దున్నుతున్న రైతు
వర్షాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఎరువులతోపాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనుల సందడి మొదలైంది. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. వ్యాపారుల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు.
– యశ్వంత్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి


