కల్వకుర్తి టౌన్: ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సంక్షేమ సేవలు అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాణిజ్య సముదాయం ద్వారా స్థానిక యువత, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు విస్తరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దుకాణాలను కార్పొరేషన్ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించి ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. క్యాటిల్ మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్ అక్కడి సదుపాయాలను పరిశీలించి, పశువుల కొనుగోలు, విక్రయాల కోసం వచ్చే రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, నిర్మాణానికి అవసరమైన సామగ్రి, సాంకేతిక సహకారం లబ్ధిదారులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, కల్వకుర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కౌన్సిలర్లు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తదితరులు పాల్గొన్నారు.


