కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో వ్యయ, ప్రయాసలతో తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజావాణిలో 42 దరఖాస్తులు వచ్చాయని.. వీటిని వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 22 ఫిర్యాదులు
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూ తగాదాలకు సంబంధించినవి కాగా.. 11 తగు న్యాయం చేయాలని, 4 భార్యాభర్తల గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ తెలిపారు.
డీఎంహెచ్‌ఓగా కృష్ణ
కందనూలు: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డా.కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తానన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు.


