మన్ననూర్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీల హక్కులపై అవగాహన కల్పించారు. శనివారం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్, అప్పాపూర్, భౌరాపూర్, రాంపూర్, చెంచు పెంటలలో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాదులు, ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాల గురించి చెంచులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. బడిఈడు పిల్లలను తప్పకుండా చదివించాలని సూచించారు. జీవితంలో గొప్పవారు కావాలంటే అందుకు చదువు ఒక్కటే మార్గం అని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. జీవించే క్రమంలో ఆదివాసీల హక్కులకు ఎవరూ భంగం కలిగించొద్దని, ఈ క్రమంలో న్యాయం పొందేందుకు న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితిలో లీగల్ సెల్ తరపున న్యాయవాదిని నియమించి ఉచితంగా న్యాయం పొందేలా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయా పెంటలలో చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీఓ రామ్మూర్తి, డిప్యూటీ చీఫ్ లీగల్ సెల్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరాం ఆర్యా, పవన శేషసాయి, ఎఫ్‌ఆర్‌ఓ సవిత తదితరులు పాల్గొన్నారు.


