మామిడి క్లస్టర్‌తో మేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి క్లస్టర్‌తో మేలు

Apr 16 2026 12:47 PM | Updated on Apr 16 2026 12:47 PM

త్వరలోనే

ప్రాసెసింగ్‌ యూనిట్‌..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో..

రైతులకు అప్పగించాలి

నాణ్యతలో బెటర్‌..

మూడేళ్ల క్రితం పాలమూరును క్లస్టర్‌గా ఎంపిక చేసిన కేంద్రం

ఎగుమతులకు ఉపయోగపడే

మామిడి ఉత్పత్తి కోసం

రూ.200 కోట్ల కేటాయింపు

నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం

నాణ్యమైన కాయలను

ఉత్పత్తి చేస్తున్న రైతాంగం

కొల్లాపూర్‌: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్‌ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్‌ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్‌లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్‌ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది.

ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా..

ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్‌ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. బేనిషాన్‌ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్‌తోపాటు హిమాయత్‌, దెషేరీ, కలెక్టర్‌, బంగారు, జహంగీర్‌ పసంద్‌, మోతిమోనీ పసంద్‌, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్‌గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి.

క్లసర్‌ ద్వారా ప్రోత్సాహకాలు..

క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్‌ కార్టన్‌ కంపెనీ, ప్రసాద్‌ సీడ్స్‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్‌ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్‌ సౌకర్యం, క్లయిమింగ్‌ ల్యాడర్స్‌, దపోలి హార్వెస్టర్‌ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్‌ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు.

పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్‌ మిషన్‌ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్‌ లైనింగ్‌ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్‌ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్‌ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది.

పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్‌గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్‌ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి.

– శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్‌

కొల్లాపూర్‌ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్‌గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్‌గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్‌ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి.

– లక్ష్మణ్‌, ఉద్యాన అధికారి, కొల్లాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement