పథకాలను ప్రజలకు వివరించాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను ప్రజలకు వివరించాలి

Apr 16 2026 12:47 PM | Updated on Apr 16 2026 12:47 PM

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అందించడమే ప్రభుత్వ లక్ష్యం

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కందనూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్లు అమరేందర్‌, జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 నుంచి మండల కేంద్రాల్లో నిర్వహించే సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మండల, గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని 20 మండలాల కేంద్రాల్లో గ్రామసభలను సమగ్ర ప్రణాళికలతో నిర్వహించి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇచ్చి.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

మెరుగైన వసతులు కల్పించాలి..

జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందిస్తున్న మెనూ అమలుపై అదనపు కలెక్టర్‌ అమరేందర్‌తో కలిసి ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందించే మెనూ ప్రకారం భోజనం అందించేందుకు అవసరమైన పదార్థాలు, వంట సామగ్రి సిబ్బంది తదితర అంశాల వారీగా నివేదికలు అందజేయాలని సూచించారు. ఎక్కడైనా మౌలిక సదుపాయాల్లో లోపాలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి.. వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా స్పష్టంచేశారు. వచ్చే విద్యా సంవత్సరం కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్యను అంచనా వేసి, వారికి సరిపడా వసతి, పడకలు, తాగునీటి సదుపాయం, తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని.. విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అదే విధంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా వైద్యపరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement