నాగర్‌కర్నూల్ క్రైం: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్.. అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల గుండా అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువత మృతి చెందుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి, రాంగ్ రూట్‌లో వాహనాలను నడపొద్దన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు విధిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్‌కుమార్, ఎస్‌లు గోవర్ధన్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


