కందనూలు: హిందూ సమాజం జాగృతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఆచార్య అభినవ శంకరానందస్వామి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి హిందువు తమ పిల్లలు, కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాగా, సమ్మేళనంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రధాన వక్త భాస్కరయోగి, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘ్‌చాలక్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి పిడికిళ్ల జంగయ్య, పట్టణ కార్యవహ్ వేముల సురేశ్ పాల్గొన్నారు.


