ఓటింగ్.. 84 శాతం
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల్లో 84 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఏడు మండలాల పరిధిలో 151 సర్పంచ్ స్థానాలకు 4 జీపీలు, 1,412 వార్డులకు 143 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 147 సర్పంచ్, 1,269 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం ఒంటిగంట దాటినా కొనసాగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్‌లో ఉన్న అందరికీ ఓటేసేందుకు అవకాశం కల్పించారు. నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దముద్దునూర్ పోలింగ్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు రాజ్యలక్ష్మి పరిశీలించారు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు.
పురుషులే
ఎక్కువ మంది..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తిమ్మాజిపేట మండలంలో అత్యధికంగా 87.2 శాతం, అత్యల్పంగా బిజినేపల్లి మండలంలో 80.7 శాతం ఓటింగ్ అయ్యింది. నాగర్‌కర్నూల్ మండలంలో 85.1, కొల్లాపూర్‌లో 86.2, పెంట్లవెల్లిలో 86.3, కోడేరులో 83.1, పెద్దకొత్తపల్లిలో 83.6 శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల పరిధిలో మొత్తం 2,50,239 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2,10,151 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళల కన్నా పురుషులే ఎక్కువ మంది ఓటువేశారు. 1,04,170 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకుంటే 1,05,980 మంది పురుషులు ఓటువేశారు. కాగా.. నాగర్‌కర్నూల్ మండలంలో 14,617 మంది పురుషులు ఓటు వేయగా.. 14,665 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మండలం 9 గంటలకు 11 గంటలకు ఒటిగంట ముగింపు
బిజినేపల్లి 18.48 52.5 74.11 80.7
నాగర్‌కర్నూల్ 24.46 57.1 83.36 85.1
తిమ్మాజిపేట 19.23 53.8 84.17 87.2
కొల్లాపూర్ 23.74 51.8 82.0 86.2
పెంట్లవెల్లి 22.62 49.8 81.27 86.3
కోడేరు 25.19 52.1 69.42 83.1
పెద్దకొత్తపల్లి 28.77 53.6 73.77 83.6


