 
															మున్సిపాలిటీలకు ఊతం
మూడునెలల్లో పూర్తిచేస్తాం..
జిల్లాలోని నాలుగు పురపాలికలకు రూ.65 కోట్లు మంజూరు 
నాగర్‌కర్నూల్: నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలకు రూ.65 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో మూడు మున్సిపాలిటీలకు రూ.15కోట్ల చొప్పున నిధులను విడుదల చేయగా.. జిల్లాకేంద్రానికి మాత్రం రూ.20 కోట్లు కేటాయించింది. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. తాజాగా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ అభివృద్ధి పనులను కొనసాగించేందుకు అవకాశం లభించినట్లయింది.
రూ.15 కోట్ల చొప్పున..
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి మున్సిపాలిటీలు ఉండగా ఒక్క నాగర్‌కర్నూల్ మినహా మిగతా మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీకి మాత్రం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులను అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కేంద్రం కొంత శాతాన్ని అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వాటాను కలిపి నిధులు మంజూరు చేసింది. దీంతో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నిధులను ఎక్కువగా డ్రెయినేజీ, సీసీ రోడ్డు వంటి పనులకు వినియోగించనున్నారు. అది కూడా విలీన గ్రామాలకు ఎక్కువ శాతం నిధులను కేటాయించనున్నారు.
సీసీరోడ్లు.. డ్రెయినేజీలు
పట్టణ మౌళిక వసతుల అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం రెండు నెలల క్రితం ఈ ప్రతిపాదనలను స్వీకరించింది. సంబంధిత ప్రతిపాదనల నిధులను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నిధులను ఎక్కువ శాతం విలీన గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ వంటి మౌళిక వసతులు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలో నాగనూల్, ఎండబెట్ల, ఉయ్యాలవాడ, నెల్లికొండ గ్రామాల్లో మౌళిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నిధులు విడుదల చేసి పనులు చేపట్టనుండటంతో ఆయా ఇబ్బందులు తీరనున్నాయి. కేవలం నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోనే కాకుండా కొల్లాపూర్ పరిధిలో ఉన్న విలీన గ్రామం చుక్కాయపల్లి, చౌటబెట్ల, కల్వకుర్తి పరిధిలోని విలీన గ్రామం తిమ్మరాసిపల్లి గ్రామాల్లోనూ అభివృద్ధి పనులను కొనసాగించనున్నారు.
విలీన గ్రామాల్లో అభివృద్ధి
పనులకు ప్రాధాన్యం
మూడు నెలల్లో పనులు
పూర్తిచేసేలా ప్రణాళిక
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి పనులను చేపడతాం. ఈ పనులు మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా పట్టణంతోపాటు విలీన గ్రామంలోనూ సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. – నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
 
							మున్సిపాలిటీలకు ఊతం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
