నూతన ఆర్టీఓ కార్యాలయానికి భూమిపూజ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా రవాణాశాఖ కార్యాలయం జిల్లాకేంద్రం నుంచి దూరంగా ఉండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ఎస్పీ కార్యాలయ సమీపంలో నూతన జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తెలిపారు. నూతనంగా కేటాయించిన జిల్లా రవాణాశాఖ కార్యాలయ భవనానికి గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ప్రభుత్వ భూమిలో కేటాయించిన జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సంబంధించిన ప్రొసీడింగ్‌లను తహసీల్దార్ తబిత ద్వారా జిల్లా రవాణాశాఖ అధికారి చిన్నబాలుకు అందజేసినట్లు తెలిపారు. త్వరలోనే జిల్లా రవాణాశాఖ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రజలకు జిల్లా రవాణా శాఖ సేవలను మరింత దగ్గర చేసేందుకే నూతన భవన నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు.


