 
															కొర్రీలు లేకుండా పత్తి కొనాలి
● శ్రీకృష్ణ కాటన్ మిల్లు వద్ద
రైతుల ధర్నా
నాగర్‌కర్నూల్ రూరల్: ఎలాంటి కొర్రీలు విధించకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గగ్గలపల్లి శ్రీకృష్ణ కాటన్ మిల్లు వద్ద పత్తి రైతులు గురువారం సాయంత్రం ధర్నాకు దిగారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా తేమశాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా అమ్మకానికి తెచ్చిన పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ సూచించిన 8–12శాతం ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామన్న నిబంధనను సవరించి.. రైతులు కష్టించి పండించిన పత్తి తేమశాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులు ధర్నా దిగడం వల్ల రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని పట్టుబట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.
కాటన్ మిల్లు వద్ద ధర్నా చేస్తున్న పత్తి రైతులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
