
విద్యాప్రమాణాల పెంపునకు కృషి
నాగర్‌కర్నూల్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి కలెక్టర్, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని 8 బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 208 మంది, సామాజిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 9 బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 1,159 మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సక్రమంగా ఉపయోగపడుతున్నాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలల నిర్వహణ సక్రమంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలోని అన్ని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. విద్యార్థుల హాజరు, బోధన, వసతుల స్థితి వంటి అంశాలను తరచుగా పరిశీలిస్తున్నామని తెలిపారు. పాఠశాలల పనితీరు మెరుగుపర్చడానికి తానే స్వయంగా పర్యటనలు నిర్వహిస్తున్నానని.. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వీసీలో జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి ఫిరంగి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి గోపాల్ నాయక్, సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షకురాలు రాగమణి, కవిత తదితరులు పాల్గొన్నారు.