
ఆహ్లాదం.. అల్లంత దూరం!
అచ్చంపేట: పట్టణ ప్రజలు ఆహ్లాదకర వాతావరణానికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలోని పార్కులు పచ్చదనం పంచలేక బోసిపోతున్నాయి. అచ్చంపేట పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండగా.. అందుకు అనుగుణంగా పార్కుల ఏర్పాటుపై మున్సిపల్‌శాఖ దృష్టి సారించలేకపోతోంది. 50ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన పటేల్ పార్కు నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. 2011 జూలై 21న మధురానగర్ కాలనీలో ఎన్టీఆర్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఆ స్థలంలో ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం నిర్మితమైంది. పార్కులకు అనువుగా ఉన్న స్థలాలను మున్సిపల్ అధికారులు ధారాదత్తం చేయడంతో ఆహ్లాదకర వాతావరణం కరువైంది.
ప్రకృతివనాల నిర్వహణ గాలికి..
పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వార్డుకో పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిట్టడవులను పెంచడం ద్వారా వాయు కాలుష్యం తగ్గి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని భావించింది. ఇందుకోసం పట్టణప్రగతి నిధులను ప్రత్యేకంగా వెచ్చించి.. ప్రకృతి వనాల్లో వేప, ఉసిరి, జామ, చింత, దానిమ్మ, టేకు, కానుగ ఇతర రకాల మొక్కలను నాటించింది. అయితే మొదట్లో వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు..కొన్నేళ్లుగా గాలికి వదిలేయడంతో అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లు పెరగాల్సిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు దర్శనిమిస్తూ.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. పట్టణ ప్రకృతి వనాలు కేవలం బోర్డులు, ఫెన్సింగ్‌లకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు.
పటేల్ పార్కు ఉనికి కనుమరుగు..
పట్టణ నడ్డిబొడ్డున సర్ధార్ వల్లబాయ్ పటేల్ పేరుతో ఏర్పాటు చేసిన పార్కు ఉనికి కనుమరుగవుతోంది. ఈ పార్కును అనుసరించి కూరగాయల మార్కెట్ గ్రంథాలయం ఉన్నాయి. రోజు ఎంతో మంది ప్రజలు వస్తుంటారు. అయితే పార్కును పునరుద్ధరించడంపై మున్పిపల్ అధికారులు దృష్టి సారించడం లేదు. శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదు. పటేల్ పార్కును పునరుద్ధరించాలని 20ఏళ్లగా పట్టణ ప్రజలు కోరుతున్నారు. గ్రంథాలయ ఆవరణలో ఉన్న ఈ పార్కును పునరుద్ధరిస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది.
● విద్యానగర్‌లోని అర్టీసీ బస్టాండ్ సమీపంలో మున్సిపల్‌శాఖ రూ. 10లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్, పార్కును పునరుద్ధరించారు. పట్టణ ప్రకృతివనం సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం ఆలయ నిర్మాణం చేపడుతుండటంతో పార్కు, ఓపెన్ జిమ్ నిర్వహణను గాలికొదిలేశారు. జిమ్ పరికరాలు వృథాగా పడి ఉన్నా మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకృతి వాతావరణానికి దూరంగా పట్టణవాసులు
నిర్లక్ష్యపు నీడలో ప్రకృతివనాలు
పార్కుల అభివృద్ధి పట్టని అధికారులు
నిర్వహణ లోపంతో పిచ్చిమొక్కలకు నిలయాలుగా మారిన వైనం
స్మృతివనం పేరిట నిధుల దుర్వినియోగం..
అటవీశాఖ కార్యాలయాన్ని అనుసరించి ఉన్న 10 ఎకరాల స్థలంలో ఏర్పాటుచేసిన స్మృతివనం నిరుపయోగంగా మారింది. దసరా, బతుకమ్మ సంబురాల నిర్వహణ సమయంలో తాత్కాలిక ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. అటవీశాఖ స్థల మార్పిడి చేయని కారణంగా ప్రజాధనం వృథా తప్ప.. ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గతేడాది శ్రీశైలం ప్రధాన రహదారిలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం, 132/33 కేవీ సబ్‌స్టేషన్ నడుమ ఏర్పాటుచేసిన పార్కును సైతం అభివృద్ధి చేయడం మరిచారు. ఇప్పటికై నా పార్కులు, పట్టణ ప్రకృతివనాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.