
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
బల్మూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం కావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని జిన్‌కుంటలో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ మండల ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్గత విబేధాలు వీడి ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సంఘటితంగా పని చేయాలని సూచించారు. గ్రూపు తగాదాలను ప్రోత్సహించే వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసే వారికి పదవులు పైరవీలు లేకుండా వస్తాయన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వారికి ప్రథమ రూ.20 లక్షలు, ద్వితీయ రూ.15 లక్షలు, తృతీయ రూ.10 లక్షలు అభివృద్ధి పనులకు తనవంతుగా అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటే క్షమించేది లేదని హెచ్చరించారు. జులై మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 10 ఎకరాలలోపు ఉన్న 93 శాతం మంది రైతులకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు జమ చేస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్‌గౌడ్, నాయకులు కాశన్నయాదవ్, సుధాకర్‌గౌడ్, నర్సింగ్‌రావు, నిరంజన్‌గౌడ్, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు రాంప్రసాద్‌గౌడ్, శైలేష్, ఖదీర్, సంపంగి రమేష్, శ్రీనివాసులు, వెంకటయ్య, పద్మ, సైదులు, అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.