జిల్లాను ప్రప్రథమంగా నిలుపుదాం
నాగర్‌కర్నూల్: జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచి.. రాష్ట్రస్థాయిలో ప్రప్రథమంగా నిలుపుదామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆయనను అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అవి అర్హులకు చేరడంలో జాప్యం లేదా అవకతవకలు జరుగుతుంటాయని, ఈ సమస్యలను అధిగమించి పథకాలు నిజమైన అర్హులకే అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాల లక్ష్యాన్ని నెరవేర్చడంలో జిల్లాస్థాయి అధికారులు అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ, అధికారులు తమ విధులకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాల అమలును పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పరిష్కారాలను మరింత సమర్థవంతంగా చేయవచ్చన్నారు. విద్య, ఆరోగ్యం, మౌళిక సదుపాయాలు, వ్యవసాయం వంటి అన్నిరంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమష్టిగా పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు రాంమోహన్‌రావు, రమేష్‌కుమార్, సీతారాంనాయక్, స్వరాజ్యలక్ష్మి, రాజేశ్వరి, నాగేందర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


