
ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
గోపాల్‌పేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ధాన్యం సేకరణను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏదుల మండలం చీర్కపల్లి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ గత పది రోజుల నుంచి లారీల కొరత వలన 7,500 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కేంద్రంలో ఉండటంతో మిగతా కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీర్కపల్లికి రోజుకు 5 లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు జిల్లావ్యాప్తంగా తరుగు, తాలు పేరుతో క్వింటాల్‌కు 3 కిలోల ధాన్యం తీస్తూ రైతులను దగా చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులకు అవసరమైన కవర్లను ప్రభుత్వమే అందించాలన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసు అధికారులు వచ్చి జిల్లా సివిల్ సప్లయ్, ఐకేపీ అధికారులు, లారీ కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోజుకు మూడు లారీలు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. తరుగు, తాలు పేరుతో జరుగుతున్న విషయాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమేష్, శేఖర్, మహే ష్, శివశంకర్, రాములు, మల్లేష్, కాసీం, శేషయ్య, సత్యనారాయణ, పర్వతాలు పాల్గొన్నారు.