
దరఖాస్తుల స్వీకరణ
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామం ఏకలవ్య మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పర్ధీప్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో 2025–26 సంవత్సరానికి ఎస్టీ విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కళాశాలల్లో దరఖాస్తు ఫారాన్ని తీసుకొని అన్ని అర్హత పత్రాలను జత చేసి ఈ నెల 24లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. వీరికి మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ ఏకలవ్య మోడల్ కళాశాలలో ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. కళాశాలలో బైపీసీ గ్రూప్‌లో బాలురకు 25 సీట్లు, సీఈసీలో 8 సీట్లు ఉన్నట్లు వివరించారు.
డిపో అభివృద్ధిలోభాగస్వాములవుదాం
కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ఉద్యోగులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎం ఉమాశంకర్ అన్నారు. పట్టణంలోని డిపో ఆవరణలో మంగళవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. డిపో పరిధిలో ఏప్రిల్ నెలలో అత్యధిక ఇన్సెంటివ్, కేఎంపీఎల్, ఈపీకే సాధించిన కండక్టర్లు, డ్రైవర్లను అభినందించి సత్కరించారు. వారికి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, నజీర్, షఫీఉల్లా, గౌసొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రోగులతో
స్నేహంగా మెలగాలి
ఉప్పునుంతల: వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా మెలిగి వైద్య సేవలు అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక సీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించి ఆస్పత్రిలో సిబ్బంది హాజరు రిజిష్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షించినన సూచనలు, సలహాలు ఇచ్చారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం కోసం వచ్చిన రోగులతో దురుసుగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. సమావేశంలో వైద్యాధికారి స్వప్న, ఫార్మాసిస్టు కుమారాచారి తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ