
కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం
కల్వకుర్తి రూరల్: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ కార్మిక హక్కుల సాధన కోసం పోరాడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమ్మెను జూలై 9కి వాయిదా వేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2019, 2020 సంవత్సరంలోనే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని, దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ప్రతిఘటన చేయడంతో వాటిని అమలు చేయలేదన్నారు. కార్పొరేట్ పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం వీటిని తెచ్చారని విమర్శించారు. పర్మినెంట్ ఉద్యోగాల వ్యవస్థ స్థానంలో తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థని నెలకొల్పడానికి బాటలు వేశారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న చేపట్టే సమ్మెను విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, మల్లేష్, రాములు, లక్ష్మమ్మ, రఫిక సుల్తానా, భాగ్యలక్ష్మి, శైలజ, స్వాతి, హసీనా, సుభద్ర, మంజుల, బాల్‌రెడ్డి, జగన్, అలివేలు తదితరులు పాల్గొన్నారు.