
ముఖ గుర్తింపుతో పింఛన్లు
త్వరలో అందుబాటులోకి ప్రత్యేక యాప్
వేలిముద్రల సమస్యలకు శాశ్వత పరిష్కారం
వృద్ధులకు తప్పనున్న పింఛన్
అందజేతలో ఇబ్బందులు
అచ్చంపేట: వయసు పైబడిన చాలామందికి చేతి వేలిముద్రలు పడక పింఛన్ పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారికి పంచాయతీ కార్యదర్శులు అథెంటిఫికేషన్ ద్వారా అందిస్తున్నారు. కానీ, లబ్ధిదారులు వచ్చిన సమయంలో వారు అందుబాటులో లేకపోవడం, వారున్న సమయంలో లబ్ధిదారులు లేకపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో.. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక ముఖ గుర్తింపు యాప్‌ను అమల్లోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గత నెల 10న రాష్ట్ర సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పింఛన్ల డైరెక్టర్ గోపాల్‌రావు అన్ని జిల్లాల డీఆర్‌డీఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్‌ఐవీ, బోదకాలు, డయాలసిస్ చేయించుకునే వారు ఇలా 1,07,390 మంది పింఛన్లు పొందుతున్నారు. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో 45,239 మందికి మాత్రమే నేరుగా ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. మిగతా 62,151 మందికి పంచాయతీల పరిధిలో తపాలా శాఖ కార్యాలయాల్లోనే వేలిముద్రల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కొందరు వృద్ధులకు వేలి కొనలు ఆరిగిపోయి ముద్ర సరిగా పడటం లేదు. ఇలాంటి వారికి కార్యదర్శుల వేలిముద్ర ద్వారా పింఛన్లు అందిస్తున్నారు.
ఇబ్బందులు ఇలా..
పంచాయతీ కార్యదర్శులు ఇతర పనుల ఒత్తిడితో కార్యాలయానికి రాకపోతే వేచి చూడాల్సిన పరిస్థితి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అవి వచ్చే ప్రాంతాల్లో తపాలా సిబ్బంది వెళ్లి పంపిణీ చేయాల్సి వస్తోంది. కార్యదర్శులు రాకుంటే లబ్ధిదారులు అంత దూరం వెళ్లి తిరిగి వాపప్ రావాల్సిన దుస్థితి నెలకొంటుంది. దీంతో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పింఛను ఇస్తుండగా.. వీటిలోనూ చాలా చోట్ల చిల్లర సాకుతో రూ.16 కోత విధిస్తున్నారనేది బహిరంగ రహస్యమే.
అక్రమాలకు అడ్డుకట్ట..
జిల్లాలో 4,383 మందికి వేలిముద్రలు పడకపోవడం, మంచానికే పరిమితమైన కార్యదర్శులు అథెంటిఫికేషన్ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కార్యదర్శులు వేలిముద్రలు పడని వారివి ఒకేసారి అంథెటిఫికేషన్ చేసి వెళ్లిపోతున్నారు. తర్వాత తపాలా సిబ్బంది లబ్ధిదారులకు డబ్బులు అందిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు తెలియకుండా పింఛన్లు వాడుకుంటున్న ఘటనలు జరిగాయి. ఇదే కాకుండా పింఛన్‌దారులు మృతిచెందినా.. వారి పేరున నెలల తరబడి అలాగే డబ్బులు పొందుతున్నారు. ముఖ గుర్తింపు యాప్‌తో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు.
చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వం పింఛన్‌దారులకు ముఖ గుర్తింపు యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. యాప్ అందుబాటులోకి వస్తే అమలు చేస్తాం. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వేలిముద్రలు పడని, మంచానికే పరిమితమైన 4,383 మంది పింఛన్‌దారులకు కార్యదర్శులు అథెంటిఫికేషన్ ద్వారా పింఛన్లు అందిస్తున్నారు.
– ఓబేలేష్, డీఆర్‌డీఓ

ముఖ గుర్తింపుతో పింఛన్లు