
లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు ప్రశాంత వాతావరణంలో కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా కోర్టు న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బ్యాంకులు, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 14న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకుంటే సమయం, ఖర్చులు ఆదా అవుతాయని, ఇరువర్గాలు సుఖసంతోషాలతో జీవించవచ్చని, రాజీమార్గమే రాజమార్గమన్నారు. జిల్లాలో విద్యుత్‌శాఖకు సంబంధించిన కేసులన్నీ కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. క్రిమినల్, చిన్న చిన్న తగాదాలు, డ్రంకెన్ డ్రైవ్, భూ వివాదానికి సంబంధించిన సివిల్ కేసులను కూడా రాజీ చేసుకోవచ్చని సూచించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీమా సుల్తానా పాల్గొన్నారు.
జిల్లా కోర్టు న్యాయమూర్తి రమాకాంత్