
పిల్లలమర్రిలో పకడ్బందీ ఏర్పాట్లు
పాలమూరు: ప్రపంచ సుందరీమణి పోటీల్లో పాల్గొనేవారు ఈ నెల 16న పిల్లలమర్రి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వస్తున్న క్రమంలో ఎక్కడా కూడా సమస్య లేకుండా భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిలో గురువారం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షం, పురావస్తు మ్యూజియం, శ్రీరాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం సందర్శిస్తారన్నారు. పర్యాటక ప్రాంతం దగ్గర స్వాగత ఏర్పాట్లు, సౌండ్, విద్యుత్ దీపాలు, పటిష్ట భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీఓ నవీన్, ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, డీఆర్‌డీఓ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్, పురావస్తు శాఖ ఏడీ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.