
కొలిక్కిరాని ఇందిరమ్మ ఇళ్ల జాబితా
పారదర్శకంగా ఎంపిక..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకత పాటిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఇల్లిల్లూ తిరిగి సర్వే చేపడుతున్నాం. ప్రస్తుతం ఎల్–1 జాబితాలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎల్–2లో పొరపాట్లను సరిదిద్దుతున్నాం. ఈ రెండు జాబితాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేపడుతున్నాం. – సంగప్ప, పీడీ,
గృహనిర్మాణశాఖ, నాగర్‌కర్నూలు
అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు దరఖాస్తుదారులకు గగనంగా మారుతోంది. దరఖాస్తులు అధికంగా.. మంజూరు తక్కువగా ఉండటంతో మొదటి విడత అదృష్టం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. లబ్ధిదారుల ఎంపికను పర్యవేక్షించే ఇందిరమ్మ కమిటీలు, అధికారులకు ఇది ఒక సాహసంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మార్పుచేర్పులతో అయోమయం నెలకొంది. పట్టణాల్లో పథకం అమలుపై స్పష్టత కరువైంది. పురపాలికల్లో ప్రజాపాలనలో అందిన దరఖాస్తులను వివిధ దశల్లో వడపోశారు. స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్–1, ఇంటి స్థలం లేని దరఖాస్తుదారులను ఎల్–2, ఇతరులను ఎల్–3 కేటగిరీగా నిర్ధారించారు. జిల్లాలోని పురపాలికల్లోతొలి దశ సర్వే అనంతరం ప్రత్యేక బృందాలతో మరోసారి వడపోసి తుది జాబితాను రూపొందించారు. ఇవన్నీ కాదని ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాల పేరిట ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగా 673 మంది లబ్ధిదారుల వివరాలతో జాబితాను పంపించి సర్వే చేపట్టారు. తాజాగా.. ఆ జా బితా కూడా కాదని మరోటి వస్తుందని, దానిని అనుసరించి సర్వే చేయాలని ఆదేశాలు అందాయి. ఇప్పటికే నాలుగు పర్యాయాలు వార్డుల్లో సర్వే జరిగింది. మరో కొత్త జాబితా ప్రకారం సర్వే చేయడానికి ప్రజల వద్దకు వెళ్లేందుకు అధికారులు వెనుకాడుతున్నారు.
ఇదీ కథ..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేయనుంది. పురపాలికల్లో ఈ పథకానికి పీఓంఏవైని అనుసంధానించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవైని అమలు చేస్తే ఒక్కో ఇంటికి రూ.75 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షలు కేంద్రం వాటాగా అందుతుంది. పీఎంఏవై నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయొద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వేచేసి లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయడంతో పాటు పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేస్తున్నారు.
కఠిన నిబంధనలు..
జిల్లాలోని పురపాలికలకు గృహనిర్మాణశాఖ ద్వారా అందిన ఎల్–1 కేటగిరీ లబ్ధిదారుల పేర్లను వార్డుల వారీగా విభజించారు. సుమారు 60 మంది వివరాలు వెబ్‌సైట్‌లో లేవని గుర్తించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారి పేర్లు జాబితాలో ఉన్నట్లు తెలిసింది. లబ్ధిదారులు ఆధార్‌తో పాటు వారి తల్లిదండ్రుల ఆధార్ వివరాలు సమర్పించాలనే నిబంధన ఉంది. దరఖాస్తుదారుల్లో 50 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల ఆధార్ వివరాలు లేకపోవడంతో అప్‌లోడ్ చేయలేకపోయారు. దీంతోపాటు ఆదాయ ధ్రువీకరణ, పాన్‌కార్డు, స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలనే నిబంధనలు ఆటంకంగా మారాయి. 15 రోజుల అనంతరం కొన్నింటికి ఎడిట్ ఆప్షన్లు వచ్చాయి. అయినా కొన్ని దరఖాస్తులనే పీఎంఏవై వెబ్‌సైట్‌లో చేర్చారు. 500 మంది జాబితాలో వార్డుకు ఎందరిని ఎంపిక చేయాలనే సూచన లేదు. నాయకుల ఒత్తిడి, వార్డుల్లో ప్రజల ప్రతిఘటనతో సర్వే నత్తనడకన సాగుతోంది. ఇదిలా ఉండగా.. రెండు, మూడు రోజుల్లో వచ్చే జాబితాను అనుసరించి సర్వే చేయాలని, గతంలో చేసిన సర్వేలు, జాబితాలతో సంబంధం లేదని అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి ముందకెళ్తామని పుర కమిషనర్లు చెబుతున్నారు.
సర్వేలతో ఎల్–1, 2, 3 కేటగిరీలుగా విభజన
తుది జాబితా రూపకల్పనకు అధికారుల అవస్థలు

కొలిక్కిరాని ఇందిరమ్మ ఇళ్ల జాబితా